
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల మలేషియాకు, ముఖ్యంగా పర్యాటక ద్వీపమైన లంకావికి చేసిన పర్యటన, ఆ చిత్రాలు ఇంటర్నెట్లో దుమారం రేపుతున్నాయి. బిజెపి, సోషల్ మీడియాలో ప్రజల నుండి విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ చిత్రాలు మరోసారి గాంధీ ‘పార్ట్-టైమ్ రాజకీయ నాయకుడు’ అనే ఆరోపణలను రేకెత్తించాయి. గాంధీ బీహార్ `ఓటు యాత్ర’ లేదా ఇతర రాజకీయ పర్యటనలు ఆయనకు కేవలం ‘ఓ బాధ్యత’ మాత్రమే అని, వాటిని యాంత్రికంగా పూర్తి చేసుకుంటూ, తద్వారా విదేశాలలో సెలవులను ఆస్వాదించడం పైననే ఎక్కువగా దృష్టి సారిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆయన మలేషియా పర్యటన ఈ నమూనాకు సరిపోతుందని తెలుస్తోంది. కొందరు రాహుల్ గాంధీ మలేషియా పర్యటనను బాధ్యతారహిత వైఖరిని ప్రదర్శించేదిగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు లోతుగా పాతుకుపోయిన కుట్రను అనుమానిస్తున్నారు. ముఖ్యంగా, రాహుల్ గాంధీ చేసిన విదేశీ పర్యటన వివాదాన్ని రేకెత్తించడం ఇదే మొదటిసారి కాదు. ఆయన అమెరికా, ఇటలీ, బ్యాంకాక్ పర్యటనలు కూడా ఇలాంటి అనుమానాలను రేకెత్తించాయి.
అంతేకాకుండా, ఇస్లామిక్ ఛాందసవాది జకీర్ నాయక్ భారతదేశం విడిచి వెళ్ళిన తర్వాత మలేషియా పౌరసత్వం తీసుకున్నందున గాంధీ మలేషియా పర్యటన వివాదాస్పదమైంది. అదే సమయంలో నాయక్ అదే దీవిలో అంతర్జాతీయ ఇస్లామిస్ట్ కాన్ఫరెన్స్ జరిపారు. దానిలో పలు దేశాల `భారత్ వ్యతిరేక’ ధోరణులు గల దౌత్యవేత్తలు కూడా పాల్గొన్నారు.
అలెగ్జాండర్ సోరోస్ కూడా ఉన్నారు. అటువంటి వారితో ‘ప్రత్యేక సమావేశం’ కోసం మలేషియాకు వెళ్లి ఉండవచ్చనే ఊహాగానాలకు ఆస్కారం కలుగుతుంది. “ఆయన తన గురువు జాకీర్ నాయక్‌ను కలవడానికి మలేషియా వెళ్ళారు” అని ఒక ఎక్స్ యూజర్ రాశాడు. బిజెపి నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ సందర్శన సమయం, ఉద్దేశ్యాన్ని ఎగతాళి చేశారు. దీనిని గాంధీ “రాజకీయ పర్యాటకం” కి మరొక ఉదాహరణగా అభివర్ణిస్తూ, దాని ఔచిత్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రశ్నించారు.
“ఆయన రాజకీయ పర్యాటకం కొన్నిసార్లు దేశంలోనే జరుగుతుంది, కొన్నిసార్లు విదేశాలలో జరుగుతుంది. ఆయన భారతదేశంలో ఉన్నప్పుడు, బాంబులు, విస్మరించిన తుపాకులను నిర్వీర్యం చేసినట్లు మాట్లాడుతారు. వాటితో తాను అద్భుతాలు చేస్తానని చెబుతారు. విదేశాలలో ఆయన ఏమి చేయాలనుకుంటున్నారో, అది ఆయనకు మాత్రమే తెలుసు. మేము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ పర్యాయం రాజకీయ పర్యాటకం ఆయనకు కొంత జ్ఞానాన్ని తెస్తుందని ఆశిస్తున్నాము” అని తెలిపారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలకమైన దశతో ఉండటంతో రాహుల్ ఇటువంటి పర్యటనలు చేపట్టడంతో ఈ విధమైన విమర్శలు వస్తున్నాయి. అక్కడ ఆయన పార్టీ, ఇండియా కూటమిలో కీలక సభ్యులు వ్యక్తిగత పర్యటనలు అంటూ కొట్టిపారవేసిన్నప్పటికే రాజకీయ దాడులకు ఆజ్యం పోస్తున్నాయి.
ఈ పర్యటన గురించి అడిగినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ వీరేంద్ర సింగ్, “ఇది వ్యక్తిగత విషయం అయి ఉండాలి. ఆయన పర్యటనలన్నింటికీ సంబంధించిన పూర్తి వివరాలు మాకు తెలియడానికి మేము ఆయన పీఏ కాదు, పీఆర్ఓ కాదు. భారత జాతీయ కూటమి విషయానికొస్తే, ఆయన లేనప్పుడు కూడా ఈ కూటమిని నిర్వహించగల నాయకులు చాలా మంది ఉన్నారు” అని సమర్ధించుకున్నారు.
బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా గతంలో రాహుల్ గాంధీ సాధారణ దుస్తులు ధరించిన ఫోటోను ట్వీట్ చేశారు, “అదృశ్యమయ్యే కళను పరిపూర్ణం చేసినందుకు” ఆయనను ఎగతాళి చేశారు. “బీహార్ రాజకీయాల వేడి, ధూళి కాంగ్రెస్ యువరాజ్‌కు చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయన విరామం కోసం తొందరపడాల్సి వచ్చింది. లేదా ఎవరికీ తెలియకూడని ఆ రహస్య సమావేశాలలో ఇది మరొకటినా?” అంటూ ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు తరచుగా వివాదానికి దారితీస్తున్నాయి. తాజాది మలేషియాకు. ఈ పర్యటన వ్యక్తిగతమైనదని, ముందస్తు షెడ్యూల్ లేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నా, “తరచుగా అదృశ్యం” చుట్టూ ఉన్న రాజకీయ కథనం మందగించే సంకేతాలను చూపించడం లేదు. అదేవిధంగా, సోషల్ మీడియాలో కూడా ప్రజలు రాహుల్ గాంధీ గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఉత్తర భారతదేశం వరదల్లో మునిగిపోతుండగా, రాహుల్ గాంధీ ప్రజలను పట్టించుకోకుండా వదిలివేసి మలేషియాకు సెలవుల కోసం వెళ్లారని ఎద్దేవా చేస్తున్నారు. ఒక ప్రజా నాయకుడు ప్రజల మధ్య ఉండాల్సిన సమయంలో సెలవులకు వెళ్లడం సముచితమేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కాలంలో లేదా తన పార్టీకి తనకు అత్యంత అవసరమైన సమయంలో ప్రజలకు సమాచారం ఇవ్వకుండా సెలవులకు వెళ్లే ట్రాక్ రికార్డ్ రాహుల్ గాంధీకి ఉంది.
తన పార్టీలో సంక్షోభ సమయంలో గాంధీ విదేశీ ప్రయాణాలకు, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ప్రోత్సహించడంలో కూడా ప్రసిద్ధి చెందారు. 2019లో ఆయన బ్యాంకాక్ పర్యటన కూడా అంతే వివాదాస్పదమైంది. ఆ సమయంలో కూడా ఆయన ఎన్నికల మధ్యలో వెళ్లి ఒక పర్యటనకు వెళ్లారు.
ఆయన విదేశీ పర్యటనలపై లేవనెత్తిన ప్రశ్నలు ఆధారం లేనివి కావు. ఎందుకంటే ఆయన విదేశీ పర్యటనల సమయంలో చాలాసార్లు భారత వ్యతిరేక అంశాలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు, 2023లో, అమెరికా పర్యటన సందర్భంగా, ఆయన హిందూ ఫర్ హ్యూమన్ రైట్స్ (హెచ్ఎఫ్ హెచ్ఆర్) సహ వ్యవస్థాపకురాలు సునీతా విశ్వనాథ్‌ను కలిశారు. ఈ సంస్థ భారతదేశంలో హిందువులు వివక్షకు పాల్పడుతున్నారని ఆరోపించే ఇస్లామిస్ట్ న్యాయవాద సమూహం.
ఏప్రిల్ 2022లో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం అవసరమైనప్పుడు, ప్రశాంత్ కిషోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకుంటారనే పుకార్లు వచ్చినప్పుడు, గాంధీ విదేశాలకు వెళ్లి ఆందోళన చెందలేదు. ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరడానికి నిరాకరించిన వెంటనే, రాహుల్ గాంధీ మళ్ళీ అకస్మాత్తుగా దాదాపు 10 రోజుల పాటు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అదృశ్యమయ్యారు. ఆ సమయంలో, తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నాయకత్వం లేకుండా పని చేయాల్సి వచ్చింది.
గతంలో, డిసెంబర్ 2021లో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసినప్పుడు, రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా ఇటలీ పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటన కారణంగా, పంజాబ్‌లో ఎన్నికల సన్నాహాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలాయి. ఎందుకంటే ఆయన తిరిగి వచ్చే వరకు అనేక ర్యాలీలు వాయిదా పడ్డాయి. ఆయన ఈ పర్యటన ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి, ఆయన సొంత పార్టీ ఓటమికి కారణమైంది.
సెప్టెంబర్ 2021లో, పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా కారణంగా కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్నప్పుడు, గాంధీ కుటుంబం సిమ్లాలో సెలవులు గడుపుతోంది. డిసెంబర్ 2020లో కాంగ్రెస్ పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు, రాహుల్ గాంధీ మళ్ళీ ఇటలీకి వెళ్లారు. అదేవిధంగా, అక్టోబర్ 2019లో, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు కేవలం 15 రోజుల ముందు, ఆయన బ్యాంకాక్ వెళ్లారు.
అలాగే, 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే, ఆయన లండన్‌కు వెళ్లి ఫలితాల కోసం వేచి ఉండకుండా సెలవులు గడపడం ప్రారంభించారు. ఆయన తన తల్లి సోనియా గాంధీ పిలిచిన ముఖ్యమైన సమావేశానికి కూడా హాజరు కాలేదు. దీనితో పాటు, రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల సమయంలో తరచుగా ఎస్పీజీ భద్రత (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) తీసుకోవటంలేదు. భద్రతా నియమాలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. దీని కారణంగా, ప్రభుత్వం ఆయన ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పార్లమెంటులో దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
నిరసనలతో రగిలిపోతున్న నేపాల్… రంగంలోకి సైన్యం
భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్