భారత్‌- నేపాల్‌ సరిహద్దుల్లో హై అలర్ట్‌

భారత్‌- నేపాల్‌ సరిహద్దుల్లో హై అలర్ట్‌

* నేపాల్ లో భారతీయులకు కీలక అడ్వైజరీ

హిమాలయ దేశం నేపాల్‌ లో పరిస్థితి అదుపుతప్పింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ యువత చేపట్టిన ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. సోషల్‌ మీడియాపై విధించిన నిషేధంకు నిరసనగా యువత చేపట్టిన ఆందోళనలకు రాజకీయ సంక్షోభం తలెత్తింది. సోషల్‌ మీడియాపై విధించిన నిషేధం ఎత్తివేసినప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. 
 
ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. భారత్‌- నేపాల్‌ సరిహద్దు వద్ద పోలీసులు హైఅలర్ట్‌ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని నేపాల్‌ సరిహద్దు పానిటాంకి వద్ద పోలీసు పోస్టును ఏర్పాటు చేశారు. అక్కడికి అదనపు బలగాలను మోహరించినట్లు ఎస్పీ ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు. సరిహద్దు వద్ద అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

నేపాల్‌లోని భారతీయుల సహాయార్థం కాఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయం టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. భారతీయ పౌరులు ఏదైనా అత్యవసర పరిస్థితిలో లేదా సాయం అవసరమైతే వెంటనే 977-980 860 2881, 977-981 032 6134 నంబర్లను సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది.

మరోవైపు యువత ఆందోళనతో భారత్‌ నేపాల్‌లోని భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అక్కడ భారతీయ పౌరులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

“నిన్నటి నుంచి నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాము. చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. రాజధాని కాఠ్మాండు సహా అనేక నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. నేపాల్‌లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలి. అక్కడి అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి” అని ప్రకటనలో తెలిపింది.