ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. మంగళవారం నాడు అమరావతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామని తెలిపారు. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను వాడారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. 
 
ఇక ఈవీఎంల కొనుగోలు, వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల ముందుగానే అంటే, 2026, జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఐదేళ్ల పదవీ కాలం ముగియడానికి మూడు నెలలు ముందుగా ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాట్ల మేరకు ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. 
 
ఈ మేరకు పంచాయతీరాజ్, పురపాలక శాఖ కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇటీవల లేఖలు రాశారు.  నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం 2026, మార్చిలో.. అలాగే సర్పంచుల పదవీ కాలం సైతం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగియనుంది. దీంతో మూడు నెలలు ముందే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన లేఖలో తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్

  • 2025 అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
  • అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలి.
  • నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి.
  • నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి.
  • డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి.
  • డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి.
  • చివరకు అంటే.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.