ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం

ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం
* రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స   * పీపీపీ విధానంలో 10 కొత్త వైద్య కళాశాలలు
రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదిలో ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 
ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలు అయ్యేలా నిర్ణయించింది.
ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించేలా ప్రభుత్వ కార్యాచరణ రూపొందించనుంది. 2493 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానం అమలు చేయనున్నారు.  మొత్తం 3257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. కేవలం ఆరు గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ను రూపొందించారు.
రూ. 2.5 లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిములు ఇన్సూరెన్సు కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానానికి ఆమోదం తెలిపారు.  రూ. 2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించనుంది. 1.43 కోట్ల మంది పేద కుటుంబాలు, 20 లక్షల మంది ఇతర కుటుంబాలకూ వర్తించేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని రూపొందించారు.
 
కాగా, పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో పిపిపి పద్దతిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆర్ఎఫ్పీ జారీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. రెండో దశలో మిగిలిన ఆరు ప్రాంతాల్లోని వైద్య కళాశాలలను పీపీపీ కింద ఏర్పాటు చేసేందుకు ఫీజిబిలిటీ రిపోర్టు సిద్ధం చేయాలని నిర్ణయించారు.
 
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హోంమంత్రి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని, పార్థసారథిలతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనల రూపకల్పనకు ఉపసంఘం కృషి చేయనుంది.