
తిరుమల అన్నమయ్య భవనంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీలోని శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. శ్రీవారి భక్తులకు స్వచ్ఛంధంగా సేవలు అందించేందుకు శ్రీవారి సేవను 2000 సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా తిరుమలలో ప్రారంభించారని చెప్పారు. శ్రీవారి సేవ ప్రారంభించి ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తి కావస్తోందని తెలిపారు.
ఈ 25 సంవత్సరాలలో తిరుమల, తిరుపతిలలో దాదాపు 17 లక్షల మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛంధంగా శ్రీవారి సేవలో పాల్గొన్నట్లు చెప్పారు. శ్రీవారి సేవకులకు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం, వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామని, రోజుకు దాదాపు 3,500 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని అన్ని విభాగాలలో తమ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, భక్తులకు మేరుగైన సౌకర్యాలు కల్పించడం, తిరుమల పవిత్ర కాపాడటంలో భాగంగా గత 14 నెలలుగా టీటీడీలో అనేక సంస్కరణలు చేపట్టిందని ఈవో శ్యామలరావు తెలిపారు. ఇందులో భాగంగా క్యూ లైన్లు, పారిశుద్ధ్యం, కల్యాణకట్ట, లగేజి కౌంటర్లు, అన్నప్రసాదాలు, శ్రీవారి సేవకులతో నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ చేస్తున్నామని వివరించారు.
లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత, రుచిపై భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నదని చెప్పారు. శ్రీవారి సేవకుల ట్రైనర్స్కు ఐఐఎం అహ్మదాబాద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక డైరెక్టర్ ల ఆధ్వర్యంలో సేవకులకు సంయుక్తంగా శిక్షణ ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ శిక్షణలో ప్రధానంగా శ్రీవారి వైభవం, తిరుమల ప్రాముఖ్యత, భక్తులకు టిటిడి అందిస్తున్న సేవలు, సేవాతత్వం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ విభాగంలో 45 – 65 సంవత్సరాల వయసు ఉన్న శ్రీవారి సేవలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. తిరుమలలోని వివిధ విభాగాలలో సేవకులు అందించే సేవలను వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గ్రేడింగ్ రూపంలో అధికారులకు నివేదిస్తారు. వీరి సేవా కాల పరిమితి 15 రోజులు, 30 రోజులు, 90 రోజులు, విద్యార్హత: కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విదేశాలలో ఉన్న ఎందరో ఎన్.ఆర్.ఐ నిపుణులు శ్రీవారి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వివిధ వృత్తులలో ప్రావీణ్యం కల్గిన నిపుణులకు శ్రీవారి సేవకు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.
More Stories
2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధం
విశాఖ ఉక్కుపై వామపక్ష పార్టీల దుష్ప్రచారం నమ్మవద్దు
భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్ర మోదీనే!