పంజాబ్ యూనివర్సిటీ అధ్యక్ష పదవి మొదటిసారి ఎబివిపి కైవసం

పంజాబ్ యూనివర్సిటీ అధ్యక్ష పదవి మొదటిసారి ఎబివిపి కైవసం
48 సంవత్సరాల తర్వాత తొలిసారిగా పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని గెలుచుకోవడం ద్వారా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) చరిత్ర సృష్టించింది. యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ నుండి పరిశోధన విద్యార్థి గౌరవ్ వీర్ సోహల్ 3,148 ఓట్లను సాధించి, తన సమీప పోటీదారుడు సుమిత్ శర్మను 488 ఓట్ల తేడాతో ఓడించి విజయం సాధించాడు.
 
గౌరవ్ వీర్ సోహల్ (ఎబివిపి) 3,148 ఓట్లను సాధించగా, సుమిత్ శర్మ (స్టూడెంట్స్ ఫ్రంట్ అండ్ అలయన్స్) 2,660 ఓట్లను సాధించారు. “నా బృందం కృషి ఫలించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. విశ్వవిద్యాలయ అధికారులతో ఎబివిపి సాన్నిహిత్యంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కానీ మేము ఎవరితోనైనా ట్యాగ్ చేయబడినా, విద్యార్థుల హక్కుల కోసం పోరాడతామని స్పష్టంగా, బిగ్గరగా ప్రకటించాలనుకుంటున్నాను” అని ఎన్నికల్లో గెలిచిన తర్వాత సోహల్ స్పష్టం చేశారు. 
 
గత సంవత్సరం, ఎబివిపి అధ్యక్ష అభ్యర్థి మూడవ స్థానంలో వెనుకబడినప్పటికీ, 12 సంవత్సరాల తర్వాత పొత్తు లేకుండా జాయింట్ సెక్రటరీ పదవిని గెలుచుకోవడం ద్వారా కౌన్సిల్‌లోకి ప్రవేశించగలిగింది. అంతకుముందు, 2013లో  ఉపాధ్యక్ష పదవిని గెలుచుకుంది. ఎబివిపి పంజాబ్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (పియు ఎస్ యు), ఇండియన్ నేషనల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (ఐఎన్ఎస్ఓ)లతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. 2010 లో, ఎబివిపి పంజాబ్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంస్థ (ఎస్ఓపియు)తో పొత్తు పెట్టుకుని కార్యదర్శి పదవిని గెలుచుకుంది.