
ఈ ఏడాది చివరకు లేదా నవంబర్ నాటికి అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని (బిటిఎ) భారతదేశం ముగించుకుంటుందని తాను ఆశిస్తున్నానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఒప్పందం కోసం చర్చలలో “కొంచెం” భౌగోళిక రాజకీయ సమస్యలు వాణిజ్య విషయాలను అధిగమించాయని ఆయన పేర్కొన్నారు.
“త్వరలో విషయాలు తిరిగి ట్రాక్‌లోకి వస్తాయని , ఫిబ్రవరిలో రెండు దేశాల నాయకులు చర్చించినట్లుగా, నవంబర్ లేదా ఆ తర్వాత శరదృతువు నాటికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ముగించగలమని నేను ఆశిస్తున్నాను” అని ముంబైలో జరిగిన వార్షిక ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం 2025లో గోయల్ ప్రసంగిస్తూ పేర్కొన్నారు. వర్చువల్‌గా మాట్లాడుతూ, భారతదేశంతో వాణిజ్యం, వ్యాపార సంబంధాలను విస్తరించడంలో ప్రపంచవ్యాప్తంగా బలమైన ఆసక్తి ఉందని ఆయన చెప్పారు.
భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియా, యుఎఇ, మారిషస్, యుకె, నాలుగు యూరోపియన్ దేశాల బ్లాక్ ‘ఈఎఫ్‌టిఎ’లతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని గుర్తు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మార్చి నుంచి చర్చలు జరుపుతున్నాయి, ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ముగిశాయి. కాగా ఆగస్టు 27న అమెరికా 50 శాతం సుంకం విధించాక, తదుపరి రౌండ్ చర్చలు జరిపేందుకు భారత్ రావలసిన అమెరికా బృందం దాన్ని వాయిదా వేసేసింది. వాస్తవానికి ఆ చర్చలు ఆగస్టు 25న జరగాల్సి ఉంది.ఇదిలావుండగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ తన వైఖరిలో దృఢంగా ఉంది. పైగా అమెరికా విధిస్తున్న సుంకాలు అన్యాయపూరితంగా ఉన్నాయని పేర్కొంటోంది. భారత్, ఐరోపా యూనియన్ 13వ రౌండ్ చర్చలు సెప్టెంబర్ 8న న్యూఢిల్లీలో జరుగనున్నాయి. “భారత్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశం, చైనా, రష్యాల కన్నా భారత్ విలువలు మాకే దగ్గరగా ఉంటాయి. మా మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుంటాం” అని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఇటీవల ‘ఫాక్స్ న్యూస్’ కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.
ఇలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా భారతదేశంతో మంచి సంబంధాలను కలిగి ఉందని పునరుద్ఘాటించారు, కానీ ఈ భాగస్వామ్యం సంవత్సరాలుగా “ఏకపక్షంగా” ఉందని,, ఎందుకంటే న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను అమెరికా వస్తువులపై వసూలు చేస్తుందని, ఇది అసమతుల్య వాణిజ్య పరిస్థితిని సృష్టిస్తుందని తెలిపారు.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి