చనిపోయిన నా తల్లిని రాజకీయాల్లోకి లాగారు

చనిపోయిన నా తల్లిని రాజకీయాల్లోకి లాగారు
తన తల్లిపై చేసిన రాజకీయ విమర్శలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన తన తల్లిని కూడా రాజకీయాల్లోకి లాగారని, తన తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి తల్లినీ కాంగ్రెస్‌, ఆర్‌జేడీ అవమానించిందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఆర్‌జేడీ పాలనలో మహిళలు ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. 
 
కాంగ్రెస్‌ నీచమనస్తత్వం మరోసారి బయటపడిందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బిహార్‌ రాజ్య జీవికనిధి శాఖ సహాయ సంఘ్‌ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం, బిహార్ స్వయం సహాయక సంఘాల మహిళలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.  రాజ కుటుంబాల్లో పుట్టిన యువరాజులు పేద తల్లి బాధలు, ఆమె కుమారుడు చేసే పోరాటాలను అర్థం చేసుకోలేరంటూ రాహుల్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను ఉద్దేశిస్తూ మోదీ విమర్శించారు.
వారంతా గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టారని, బిహార్‌లో అధికారం తమ కుటుంబాలకే దక్కాలనే స్వార్థంతో ఉన్నారని ఆరోపించారు.  కానీ, ప్రజలు ఈ పేద తల్లి కుమారుడిని ఆశీర్వదించి, ప్రధానిని చేశారని గుర్తు చేశారు. దీన్ని నామ్‌దార్లు జీర్ణించుకోలేకపోతున్నారని మోదీ దుయ్యబట్టారు.  “పేద, గిరిజన కుటుంబం నుంచి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కూడా కాంగ్రెస్  ఆగౌరవపరిచింది. మహిళలపై విద్వేషం చిమ్మే ఈ రాజకీయాలనకు అంతం పలకాలి. అసలు మనం ఎలాంటి బాష మాట్లాడుతున్నాం? అమ్మలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని భారత్ ఎప్పుడూ క్షమించదు” అని ప్రధాని హెచ్చరించారు. 
 
“ఆర్జేడీ, కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి. దివంగత మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ తనను, తోబుట్టువులను పెంచేందుకు ఎంతో కష్టపడ్డారని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘అమ్మ అనారోగ్యంతో ఉండేది. అయినా మమ్మల్ని పెంచేందుకు పనిచేస్తూనే ఉండేది. మాకు దుస్తులు కొనేందుకు ప్రతి పైసా ఆదా చేసేది. మన దేశంలో అలాంటి తల్లులు కోట్లాది మంది ఉన్నారు. దేవతల కంటే తల్లి స్థానం చాలా గొప్పది” అని ప్రధాని తెలిపారు.
కాగా, ఇటీవల బిహార్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన ఓ సభలో కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రధానమంత్రి మోదీ, ఆయన తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. దీనికి సంబంధించి పార్టీ నేతలు పట్నాలోని కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందిస్తూ దీనిపై రాహుల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.