భారతీయుల అమెరికా పర్యటన తగ్గుముఖం

భారతీయుల అమెరికా పర్యటన తగ్గుముఖం
 
భారతీయుల అమెరికా పర్యటనలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. 2021 తర్వాత మొదటిసారి ఈ స్థాయిలో తగ్గుదల కనిపించడం విశేషం. ముఖ్యంగా వీసా ఆంక్షలు, రాజకీయ పరిస్థితులు దీనిపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. గతంలో అమెరికా ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు అధికంగా వెళ్ళేవారు కానీ తాజాగా ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన వీసా నిబంధనలు పైచదువుల కోసం అమెరికాకు వెళ్ళే విద్యార్థుల సంఖ్యపై ప్రతికూల ప్రభావం చూపాయి. అలాగే పర్యాటకుల సంఖ్య తగ్గడానికి ఇదే ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. తాజా అంతర్జాతీయ పరిణామాలు కూడా భారతీయులు అమెరికా పర్యటనకు వెళ్ళే నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి.

అమెరికా టూరిజం శాఖ గణాంకాల ప్రకారం, గత సంవత్సరం జూన్‌లో 2.3 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించగా, ఈ సంవత్సరం అదే నెలలో 2.1 లక్షల మంది మాత్రమే సందర్శించారు. అంటే దాదాపు 8 శాతం తగ్గుదల. జులై నెలలో కూడా ఇదే ధోరణి కొనసాగి, 5.5 శాతం పడిపోయింది. 

మొత్తం మీద అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని రికార్డులు తెలియజేస్తున్నాయి. అమెరికా టూరిజం రంగ నిపుణులు ఈ పరిస్థితి కొనసాగితే పర్యాటక రంగానికి తీవ్ర సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ నాలుగో అతిపెద్ద సోర్స్ కావడంతో  భారతీయుల రాక తగ్గడం అమెరికా టూరిజం పరిశ్రమకు ఆర్థికంగా నష్టం కలిగించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.