ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా చైనా

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా చైనా

షాంఘై కో-ఆపరేషన్ సమావేశం (ఎస్సీఓ)లో భారత ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యం ఫలిస్తోంది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి చైనా మద్దతు తెలిపింది. అన్నివిధాలుగా తాము సహకరిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి మాటిచ్చారు. ఈ విషయాన్ని ఆదివారం భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.  అంతేకాదు రష్యా నుంచి ముడి చమురు కొనడంపై అమెరికా సుంకాలు, ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని మోదీ, జిన్‌పింగ్ భావించారు.

సరిహద్దులో శాంతియుత వాతావరణం ఏర్పడే దిశగా కృషి చేసేందుకు ఇరువురు అంగీకరించారు.  ప్రధాని మోదీ లేవనెత్తిన ఉగ్రవాదం అంశంపై చర్చ జరిగింది.  సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందకు మనదేశం తీసుకుంటున్న చర్యలను ప్రధాని చాలా క్లుప్తంగా, స్పష్టంగా జిన్‌పింగ్‌కు వివరించారు. ఉగ్రవాదం బాధిత దేశాల్లో భారత్, చైనా ఉన్నాయి అని పేర్కొన్న మోదీ చైనా అధ్యక్షుడి మద్దతు కోరారు. అందుకు ఆయన అంగీకరించారు అని మీడియాకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
 
ఎస్‌సీఓ సమావేశం మధ్యలో ఇరువురు తమ బృందాలతో కలిసి పలు విషయాలపై చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై పోరు, వాణిజ్య సంబంధాల బలోపేతం, సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
 
కాగా, “భారత్‌, చైనా సంబంధాలకు ఈ ఏడాది 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక కోణం నుంచి చూడాల్సి ఉంటుంది. తియాంజిన్‌ సదస్సు ద్వారా ఈ సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. ద్వైపాక్షిక సంబంధాలలో సుస్థిర, ఆరోగ్యకరమైన అభివృద్ధి జరుగుతుంది. ముందుగా రెండు దేశాలు వ్యూహాత్మక సంప్రదింపులను బలోపేతం చేయాలి. పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవాలి” అని  జిన్‌పింగ్‌ తెలిపినట్లు చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 
 
“శత్రువులుగా, ముప్పుగా చూడకుండా రెండు దేశాలు భాగస్వాములుగా మెలగినంత కాలం ద్వైపాక్షిక సంబంధాలు సుసంపన్నం అవుతాయి. పరస్పర ప్రయోజనాల కోసం సహకారాన్ని విస్తరించుకోవాలి. ఒకరి ఆందోళనలను మరొకరు అర్థం చేసుకుంటూ శాంతియుత సహజీవనానికి బాటలు వేయాలి. సరిహద్దు ప్రాంతాలలో శాంతి, సుస్థిరత కోసం కలసికట్టుగా కృషిచేయాలి. సరిహద్దు వివాదం భారత్‌ – చైనా సంబంధాలను దెబ్బతీసేలా ఉండకూడదు” అని పేర్కొన్నారని ఆ ప్రకటన వివరించింది.