రామసేతును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలి

రామసేతును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలి

రామసేతువును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలని  బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటీషన్ విషయమై  సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో నిర్దిష్ట సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. 

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) డైరెక్టర్, ఏఎస్ఐ తమిళనాడు ప్రాంతీయ డైరెక్టర్‌ ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. బీజేనీ నేత తరఫున సీనియర్ న్యాయవాది విభా దత్తా మఖిజా, న్యాయవాది సత్య సబర్వాల్ వాదనలు వినిపించారు. జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే విషయంలో తాను చేసిన విజ్ఞప్తిపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

రామసేతువుకు సంబంధించిన మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించి, పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. వాస్తవానికి ఆయన గతేడాది జనవరిలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వానికి మరిన్ని పత్రాలు సమర్పించేందుకు ఆ సమయంలో సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.  అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో మే 13న మళ్లీ కేంద్ర సాంస్కృతిక మంత్రికి విజ్ఞప్తి చేసి, తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇతిహాసమైన రామాయణం ప్రకారం లంకాధిపతి రావణుడు నుంచి తన భార్య సీతను రక్షించేందుకు శ్రీలంకకు వెళ్లే ఉద్దేశంతో రామసేతు వంతెనను రాముడు తన మిత్రుల సహాయంతో నిర్మించాడని సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

భారతీయ ప్రాచీన చరిత్ర, భారతీయ ఉగా వ్యవస్థ ఆధారంగా లెక్కల ప్రకారం ఈ వంతెన అనేక శతాబ్దాల కిందట నిర్మించారని, 15వ శతాబ్దం వరకుపై వంతెనను కాలినడకన ప్రయాణించడానికి ఉపయోగించారని, ఆ తర్వాత తుఫానుల కారణంగా వంతెన నిరుపయోగంగా మారిందని (సుమారు 1480 ఏడి) తెలిసిందని పేర్కొన్నారు.  పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958లోని సెక్షన్ 3 అండ్‌ 4 ప్రకారం భారత ప్రభుత్వం పురాతన స్మారక చిహ్నాలను జాతీయ ప్రాముఖ్యత జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాల్సిన బాధ్యత ఉందని సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.