రుద్ర‌ప్ర‌యాగ్‌, చ‌మోలీ జిల్లాల్లో శిథిలాల్లో అనేక కుటుంబాలు

రుద్ర‌ప్ర‌యాగ్‌, చ‌మోలీ జిల్లాల్లో శిథిలాల్లో అనేక కుటుంబాలు

* జమ్ములో వర్షాలకు 41 మంది మృతి

ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌ప్ర‌యాగ్‌, చ‌మోలీ జిల్లాల్లో క్లౌడ్‌బ‌స్ట్‌ తో కుంభ‌వృష్టి కురిసింది. దీంతో భారీ స్థాయిలో అక్క‌డ వ‌ర‌ద‌, బుర‌ద పొంగిపొర్లింది.  ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాల కారణంగా సాధారణ జీవనం పూర్తిగా స్తంభించింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో వందల సంఖ్యలో కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోగా, మరికొందరు అదృశ్యమయ్యారు. అనేక ఇళ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.  బుస్కేద‌ర్ తహ‌సిల్లోని బ‌రేత్ దుంగ‌ర్ టోక్‌తో పాటు చ‌మోలీలోని దేవ‌ల్ ప్రాంతంపై తీవ్ర ప్ర‌భావం ప‌డింది.
రుద్రప్రయాగ్‌లో పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. అలకనంద, మందాకిని నదులు సంగమ ప్రదేశంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కేదార్‌నాథ్ లోయలోని లవారా గ్రామంలో వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోగా, రుద్రప్రయాగ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయం పూర్తిగా జలమయం అయింది.  ఈ ఘటనలపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్  ధామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని, తాను నిరంతరం ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు.
అధికారుల‌తో నిత్యం ట‌చ్‌లో ఉన్న‌ట్లు చెప్పారు.  బ‌రేత్ దుంగ‌ర్ టోక్‌, దేవ‌ల్ ప్రాంతాల్లో శిథిలాల ప్ర‌వాహంలో కొన్ని కుటుంబాలు చిక్కుకున్న‌ట్లు సీఎం థామి త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. హల్ద్వానీ–భీమ్‌తాల్ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. భద్రతా కారణాల వల్ల రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలీ, హరిద్వార్, పితోరాగఢ్ జిల్లాల్లో శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

కుంభ‌వృష్టి త‌ర్వాత ఇద్ద‌రు అదృశ్య‌మైన‌ట్లు జ‌ల్లా మెజిస్ట్రేట్ సందీప్ తివారీ తెలిపారు. డ‌జ‌న్ల సంఖ్య‌లో జంతువులు శిథిలాల్లో చిక్కుకున్న‌ట్లు చెప్పారు. భారీ వ‌ర్షాల వ‌ల్ల అనేక చోట్ల రోడ్ల‌ను మూసివేశారు. ప్ర‌భావిత ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను ఏర్పాటు చేశారు.

కాగా, జమ్ము ప్రాంతంలో గడచిన మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టించడంతోపాటు 41 మందిని బలిగొన్నాయి. మంగళ, బుధవారాలలో రియాసీ, దోడా జిల్లాల్లో రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలు సృష్టించిన బీభత్సానికి 41 మంది మరణించారు. వీరిలో అత్యధికులు వైష్ణోదేవి యాత్రికులే.  మంగళవారం మధ్యాహ్నం అద్కున్‌వారీ సమీపంలో వైష్ణోదేవి యాత్రా మార్గంలో సంభవించిన మేఘ విస్ఫోటం వల్ల ముంచెత్తిన ఆకస్మిక వరదల్లో 34 మంది మరణించారు.

భారీ వర్షాల కారణంగా అనేకచోట్ల కొండ చరియలు విరిగిపడడంతో చండీగఢ్‌-కులూ హైవేపైన 50 కిలోమీటర్ల పొడవునా భారీ స్థాయిలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఢిల్లీ -ఎన్‌సీఆర్‌కి పండ్లు, కూరగాయలను తీసుకువెళుతున్న వందలాది ట్రక్కులతోసహా వేలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.