
దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ భారత్‌లో తన కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తోంది. ఐ-ఫోన్లు, ఇతర ఉత్పత్తులకు భారత్ బెస్ట్ మార్కెట్‌గా నిలిచిన నేపథ్యంలో ఇండియాలో తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగంగా విస్తరిస్తోంది. ఇక ఢిల్లీ, ముంబైలో రిటైల్ స్టోర్లను తెరిచిన సంస్థ మూడో స్టోర్‌ను బెంగళూరులో ప్రారంభించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2వ తేదీన బెంగళూరులో తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు యాపిల్ గత వారం ప్రకటించింది.
ఇప్పుడు భారత్‌లో నాలుగో రిటైల్ స్టోర్‌ను పూణెలో కోరెగావ్ పార్క్ ప్రాంతంలో సెప్టెంబర్ 4న ప్రారంభించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగంగా విస్తరిస్తోన్న యాపిల్ సంస్థ బెంగళూరులో భారీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌స్టాక్ ప్రకారం బెంగళూరులో ఎంబసీ జెనిత్ భవనంలో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది.
ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎంబసీ గ్రూప్ కు చెందిన కమర్షియల్ ప్రాజెక్టు ఎంబసీ జెనిత్ లోని ఆ కార్యాలయ స్థలం కోసం 10 ఏళ్ల కాలానికి యాపిల్ సంస్థ డీల్ కుదుర్చుకుంది. 9 అంతస్తుల్లో (5 నుంచి 13వ అంతస్తు వరకు) విస్తరించి ఉన్న ఈ ఆఫీస్ స్పేస్ కోసం యాపిల్ సంస్థ నెలకు రూ.6.3 కోట్ల అద్దె చెల్లించనుంది. ఏడాదికి 4.5 శాతం చొప్పున అద్దె పెంపుతో పార్కింగ్, మెయింటెనెన్స్ చార్జీలతో కలిపిమొత్తం ఈ పదేళ్లలో సంస్థ రూ.1,000 కోట్లను అద్దెగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది.
2025 ఏప్రిల్ 3 నుంచి ఈ లీజు అమల్లోకి వచ్చింది. ఈ లీజు ఒప్పందంలో భాగంగా యాపిల్ రూ.31.57 కోట్లు డిపాజిట్ కూడా చేసింది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అతి పెద్ద మొబైల్ ఫోన్ల ఎగుమతిదారుగా యాపిల్ నిలిచిన విషయం తెలిసిందే. సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి