
* కాకినాడ, విశాఖలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులు
రాష్ట్రంలో విశాఖలో తొలి నేచర్ క్యూర్ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభం కాబోతున్నాయి. విశాఖ, కాకినాడలలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. అలాగే,విశాఖ నగరంలోనే ప్రభుత్వ ఆయుర్వేద మందుల తయారీ, నాణ్యత పరీక్షల ప్రయోగ శాల కూడా రాబోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం 2016–17లో నేచర్ క్యూర్ ఆసుపత్రి (ప్రకృతి వైద్య కళాశాల), రెండు ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అప్పటి ప్రభుత్వం చేసిన కృషిని ఆ తర్వాత అధికారంలోనికి వచ్చిన గత ప్రభుత్వం కొనసాగించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన అనంతరం మంత్రి సత్యకుమార్ చూపుతున్న చొరవతో కాకినాడ ఆసుపత్రికి రూ.7.17 కోట్లు, విశాఖలో ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రికి రూ.4.18 కోట్లు, నేచర్ క్యూర్ వైద్య కళాశాలకు రూ.4.08 కోట్లు మంజూరయ్యాయి.
విశాఖలోని విమ్స్ ప్రాంగణంలో రూ.16.40 కోట్లతో చేపట్టిన నేచర్ క్యూర్ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి బ్యాచులర్ ఆఫ్ నాచురోపతి అండ్ యోగా సైన్సెస్ (బీఎన్వైఎస్) కోర్సులో తరగతులు ప్రారంభంకానున్నాయి. బీఎన్ వైఎస్ కోర్సులో 50 సీట్ల భర్తీకి కేంద్రం ఆమోదం తెలుపనుంది.
ఈ కళాశాల పక్కన రూ.14.85 కోట్ల వ్యయంతో 50 పడకలతో చేపట్టిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి నిర్మాణపనులు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో ఆయుర్వేద, హోమియో, యూనాని వైద్య సేవలు ప్రజలకు త్వరలోనే అందుబాటులోనికి వస్తాయి. వీటి ఆధారంగా కేంద్రం అడ్మిషన్స్ కు అనుమతి ఇస్తుoది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినందున అడ్మిషన్స్ త్వరగా స్టార్ట్ చేయడానికి వెసులుబాటు ఉంది.
నేచర్ క్యూర్ వైద్య కళాశాల ఏర్పాటుకు తగ్గట్లు ప్రత్యేకంగా నేచర్ క్యూర్ ఆసుపత్రి ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 50 పడకలతో ఈ ఆసుపత్రి ఏర్పాటుపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. సుమారు రూ.16 కోట్లు కేంద్రం నుంచి రానున్నాయి. కాగా, విశాఖలోని శొంఠ్యాం ప్రాంతంలో సుమారు రూ.6 కోట్లతో ఆయుర్వేద ఫార్మాసీ, డ్రగ్ టెస్టింగ్ లేబరోరేటరీల భవన నిర్మాణాలు పూర్తికావొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సుమారు రూ.5 కోట్లతో పరికరాలు, యంత్రాలు, ఇతర వాటి కొనుగోళ్ల ప్రక్రియ జరగనుంది.
More Stories
ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా షర్మిలా!
అంతర్వేది తీరంలో సముద్రం వెనుకంజ
షర్మిల జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలా? క్రైస్తవ మత ప్రచారకురాలా?