ప్రభుత్వ ఆస్పత్రి కోసం భూసేకరణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంస్థలు నిరసనలకు పిలుపునివ్వడంతో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ ను ఆదివారం గృహనిర్బంధంలో ఉంచారు. రాంచీకి వెళ్తుండగా మార్గమధ్యలోనే చంపాయ్ సోరెన్ కుమారుడు బాబూలాల్ సోరెన్, అతని మద్దతుదారులను కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు.గిరిజన సంస్థల నిరనసల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ముందు జాగ్రత్తగా చంపాయ్ సోరెన్‌ను హౌస్ అరెస్టు చేసినట్టు రాంచీ నగర డీఎస్పీ కేవీ రామన్ తెలిపారు.
గిరిజన సంస్థల నిరసనలను దృష్టిలో ఉంచకుని రాంచిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనికి ముందు చంపాయ్ సోరెన్ మీడియా సమావేశంలో జేఎంఎం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గిరిజన భూములను ప్రభుత్వం ఆక్రమించుకుంటోందని ఆరోపించారు. రాంచీ నగ్రీ ఏరియాలో రూ.1000 కోట్లతో రిమ్స్-2 ఆసుపత్రి కోసం బలవంతంగా గిరిజనుల భూములు లాక్కున్నారని, వారికి పరిహారం కానీ, భూములు ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వడం కానీ జరగలేదని చంపాయ్ సోరెన్ ఆరోపించారు.
తాము ఆసుపత్రి ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, రాంచీలో నిరుపయోగంగా ఎన్నో ఎకరాల భూములున్నాయని, అక్కడ ఆసుపత్రి కట్టవచ్చని తెలిపారు. రాష్ట్రంలో గిరిజనులను టార్గెట్ చేస్తున్నారని, హక్కుల కోసం అడిగితే ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్న సూర్య హన్స్డాను అరెస్టు చేసి ఎన్కౌంటర్లో చంపేశారని, ఆయన గిరిజనుడు కావడమే ఇందుకు కారణమని చంపాయ్ సోరెన్ మండిపడ్డారు.
ఈ భూమికి యజమానులమని తాము చెప్పుకుంటున్నామని, కానీ అసలైన చేదు నిజం ఏమిటంటే రేషన్ కార్డు మీద వచ్చే 5 కేజీల బియ్యంపై ఆధారపడి బతుకుతున్నామని పేర్కొన్నారు. ఆ బియ్యం కోసం కూడా పడిగాపులు కాస్తున్నామని, ఈ పరిస్థితి మారాలని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.

More Stories
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!
భారత అంతరిక్ష రంగం 2025లో అద్భుత పురోగతి