
అంతర్జాతీయ సవాళ్లు భారత వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని ఎస్‌బిఐ రీసెర్చ్ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత జిడిపి 6.3 శాతానికే పరిమితం కానుందని పేర్కొంది. ఇది ఆర్‌బిఐ అంచనా 6.5 శాతం కంటే తక్కువని తెలిపింది. గడిచిన 2024-25లో 6.5 శాతానికి వృద్ధి పడిపోయిన విషయాన్ని గుర్తు చేసింది.
ఇంతక్రితం ఏడాది ఏకంగా 9.2 శాతం పెరుగుదల నమోదయ్యింది. ఎస్‌బిఐ రీసెర్చ్ రిపోర్ట్ వివరాలు ప్రస్తుత 2025-26 జూన్ త్రైమాసికంలో జిడిపి 6.8-7 శాతం మధ్య ఉంటుందని అంచనా. ప్రయివేటు మూలధన వ్యయాలు తక్కువగా ఉండటంతో వృద్ధిపై ప్రతికూలత చోటు చేసుకుంది. 2025-26లో భారత జిడిపి 6.3 నుంచి 6.8 శాతం మధ్య ఉండొచ్చని రిపోర్ట్ అంచనా.
ఇది బలమైన సూక్ష్మ ఆర్థికాంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవడానికి జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా విధాన చర్యలు అవసరం. తక్కువ ప్రయివేటు మూలధనం వ్యయం ఉండటం ఆందోళనకర అంశం. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల వ్యయం భారీగా తగ్గింది. ఇది వృద్ధిని ప్రభావితం చేస్తోంది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్‌లు పలు రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. జులై నుంచి సెప్టెంబర్‌తో ముగియనున్న ద్వితీయ త్రైమాసికంలో టెక్స్‌టైల్స్, అభరణాలు, తోలు, రసాయనాలు, వ్యవసాయచ ఆటో మొబైల్ పరికరాలు తదితర రంగాల ఆదాయాల్లో ఒత్తిడి జిడిపిపై ప్రతికూలతను పెంచనుందనని ఎస్‌బిఐ రీసెర్చ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
ట్రంప్ అధిక టారిఫ్‌లు భారత జిడిపిని దెబ్బతీయనున్నాయని ఇప్పటికే పలు ఎజెన్సీలు విశ్లేషించాయి. అధిక సుంకాలతో 2025-26 భారత జిడిపి 0.4 శాతం తగ్గి 6.1 శాతానికి పరిమితం కావొచ్చని అంతర్జాతీయ ఫైనాన్సీయల్ సంస్థ గోల్డ్‌మాన్ సాచ్ విశ్లేషించింది. జిడిపి 0.4 శాతం తగ్గొచ్చని ఫైనాన్సీయల్ సంస్థ సిటీ, 0.3 శాతం పడిపోవచ్చని క్వాంట్ ఎకో రీసెర్చ్, 0.3-0.6 శాతం వరకు పతనం కావొచ్చని కొటాక్ అల్టర్నేట్ విశ్లేషించాయి. ఫిచ్ రేటింగ్స్ 6.3 శాతానికి కోత పెట్టిన విషయం తెలిసిందే.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి