భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి

భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది.   బుధవారం ఉదయం 8 గంటలకు 42.8 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి, ప్రస్తుతం 43.2 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.  ఈ వరద నీరు భద్రాచలం కల్యాణకట్ట వరకు చేరింది. ఈ మేరకు అధికారులు నది వద్ద గజ ఈతగాళ్లు, లాంచీలు ఏర్పాటు చేశారు.
మంగళవారం వరకు 36 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి నీటిమట్టం రాత్రి నుంచి వరద వేగంగా పెరుగుతూ 42 అడుగులకు చేరుకుంది. బుధవారం ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 42.2 అడుగుల వద్ద ప్రవహించింది.  అలాగే ఉదయం 8 గంటలకు 42.8 అడుగుల వద్దకు చేరి ప్రవహించగా, ఉదయం 9 గంటలకు 43 అడుగులకు చేరుకుంది. గోదావరి నీటిమట్టం 43 అడుగులు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉదయం 10 గంటలకు 43.6 అడుగులకు నీటిమట్టం చేరింది.
దీంతో జిల్లా కలెక్టర్​ జితేశ్​ వి. పాటిల్​ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇలా నీటిమట్టం పెరగడంతో స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద చాలా వరకు మెట్లు, విద్యుత్​ స్తంభాలు వరద నీటిలో మునిగిపోయాయి. వరద నీరు ఎక్కువ రావడంతో కల్యాణ కట్ట భవనం వరకు చేరింది. అలాగే మరోవైపు గోదావరి దిగువన ఉన్న శబరి ఉపనదికి వరద ప్రవాహం పెరుగుతోంది.

దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద నీటిమట్టం పెరగడంతో నార చీరల ప్రాంతం వరదనీటిలో మునిగింది. చర్ల మండలంలోని తాలుపేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు వచ్చి చేరుతున్నాయి. ఈ ప్రాజెక్టు వద్ద 8 గేట్లను ఎత్తి అధికారులు 10 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు. 

గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో మత్స్యకారులు గోదావరి పరివాహక ప్రాంతం వద్దకు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రస్తుతం 9,32,288 క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నది పరిహహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. 

వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని, ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజలు రక్షణ చర్యల్లో సహకరించాలని, అధికారుల సూచనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ కోరారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లకు సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు.