యస్. విష్ణువర్ధన్ రెడ్డి
ఉపాధ్యక్షుడు, ఏపీ బీజేపీ !
“ఓట్ల సవరణ జరిగినప్పుడు మనమే అధికారంలో ఉన్నాం. సరిగ్గా పరిశీలించకపోవడం మన తప్పే” అని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు .. కాంగ్రెస్ పార్టీకే చెందిన మంత్రి కేఎన్ రాజన్న సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ వెర్రి తనాన్నే బయటపెడతావా? అని ఆగ్రహించిన హైకమాండ్ రాజన్న పదవిని పీకేసింది. కానీ రాజన్న వ్యక్తం చేసిన సందేహమే అందరికీ ఉంది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఓట్ల చోరీ జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చి ఉండేది? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించక ముందు బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఓట్ల చోరీ చేసి గెలవగలిగితే ఎందుకు బీజేపీ పరాజయం పాలయ్యేది?. కాంగ్రెస్ ఎలా గెలిచేది?. రాహుల్ గాంధీ ఈ లాజిక్ మిస్సయ్యారు. కానీ ప్రజలు మిస్ కారు.
ప్రతిపక్ష నేతలు ఎవరైనా అధికార పార్టీ మీద పోరాడతారు. వారి పోరాటంతో ప్రజల్ని మెప్పించి అధికారంలోకి రావాలనుకుంటారు. కానీ మన దేశ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత మాత్రం భిన్నం. ఆయన ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూంటారు. తమ పరిశీలనలో తేలిందంటూ కర్ణాటకలోని మహదేవపురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా అక్రమాలు అంటూ బయట పెట్టారు.
దాన్ని ఆయన ఖచ్చితం అని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ ప్రకటించినవి వాస్తవాలేనని చెప్పి ఫిర్యాదు చేయాలని కోరింది. ధృవీకరించి అఫిడవిట్ లాగా ఇవ్వాలని కోరింది. కానీ ఆ పనిచేయడానికి రాహుల్ సిద్ధంగా లేరు. రాహుల్ ఎన్నికల సంఘంపై పోరాడాలని అనుకోవడమే వ్యూహాత్మక తప్పిదం.
ఆయనకు ఆ సలహాలు ఎవరు ఇచ్చారో కానీ ఇప్పుడు కర్ణాటకలోని మహదేవపుర ఓటర్ల జాబితాను బయట పెట్టి అదే అణుబాంబు అని ప్రకటించుకోవడం మరింత వ్యూహాత్మక తప్పిదం. ఓటర్ల జాబితాలో అక్రమాల గురించి హర్యానా లేదా మహారాష్ట్రల్లోని జాబితా తీసుకుని ఉండాల్సింది. ఎందుకంటే అక్కడ తాము గెలవాల్సింది ఓడిపోయామని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా వచ్చినా గెలవలేదని వాపోతున్నారు.
అక్కడి జాబితాను కాకుండా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు అని ఎన్నికల సంఘంపై యుద్ధం చేయడానికి బయలుదేరడం విచిత్రం. రాహుల్ గాంధీ చెప్పిన మహదేవ్ పురా అసెంబ్లీ నియోజకవర్గం పూర్తి స్థాయిలో పట్టణ ప్రాంతం. బెంగళూరు అంటే ఉపాధి కేంద్రం. దేశం నలుమూలల నుంచి వచ్చి అక్కడ స్థిరపడతారు. ఓటర్లుగా నమోదు చేసుకుంటారు. తమ సొంత ప్రాంతాల్లో ఓట్లు ఉన్నా అదే పని చేస్తారు.
అందుకే మెట్రో నగరాల్లో ఓటింగ్ ఎప్పుడూ యాభై శాతం వరకూ రాదు హైదరాబాద్‌లోనూ అంతే. మహదేవ్ పురాలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఉన్న 6.5 లక్షల మంది ఓటర్లలో లక్ష ఫేక్ అని రాహుల్ అన్నారు. అందులో ఎన్ని నిజాలు ఉన్నాయో విచారణలో తేలుతాయి. ఓటర్ల జాబితాలో లోపాలు ఫలితాలను మార్చలేవు.
సాయంత్రం 5 గంటల తర్వాత రిగ్గింగ్ చేస్తున్నారని రాహుల్ ఆరోపిస్తున్నారు. కానీ అలా చేయాలంటే కొన్ని వేల మంది భాగస్వామ్యం కావాలి. ఎన్నికల ప్రక్రియలో అది అసాధ్యం. అదే సమయంలో పోలింగ్ వ్యవస్థలో కాంగ్రెస్ ఏజెంట్లూ ఉంటారు. కర్ణాటక లాంటి బలమైన క్యాడర్ ఉన్న రాష్ట్రాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో తమ ప్రతినిధి ఈవీఎంకు సీల్ వేసే వరకూ ఉంటారు. మరి రిగ్గింగ్ ఎలా జరుగుతుంది..?
మహదేవపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ బయట పెట్టిన అంశాలపై మీడియా ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఓ చిన్న ఇంట్లో ఎనభై మంది ఓటర్లను చూపిస్తున్నారని రాహుల్ అన్నారు. అక్కడికి వెళ్లి మీడియా చెక్ చేస్తే అది నిజమని తేలింది. అక్కడ ఓటర్లెవరూ లేరు. ఎందుకంటే లేరంటే వారంతా వలస కూలీలు. గుర్తింపు కార్డు కోసం రెంటల్ అగ్రిమెంట్ తో ఓటు నమోదు చేసుకుంటారు. మరో చోట ఉపాధి దొరికగానే వెళ్లిపోయారు. కానీ ఓటర్ జాబితాలో పేరు అలాగే ఉంది.
మరో కేసులో ఓ వ్యక్తి బెంగళూరులోనే ఉన్నాడు. కానీ గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు అక్కడ కూడా ఓట్లు నమోదు చేయించుకున్నాడు. ఆ ఓట్లు తొలగించలేదు. ఓటర్ జాబితాలో డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, ఫేక్ ఓట్లు ఇలా చాలా ఉంటాయి. నగరాల్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి.
ఉపాధి కోసం వచ్చిన వారు ఓటు నమోదు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఓట్లు నమోదు చేసుకుంటారు. ఓటర్ జాబితాలో ఉండే ఇలాంటి తప్పిదాల వల్ల మెట్రో సిటీల్లో యాభై శాతం కూడా పోలింగ్ జరగదని చెబుతూంటారు. ఎందుకంటే ఓటు నమోదు చేసుకుని పోయినవాళ్లు ఆ సంగతి మర్చిపోతారు. ఇంకో చోట ఓటు నమోదు చేసుకుంటారు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఓట్ల చోరీ అంటూ మాట్లాడుతున్న రాహుల్ బీహార్‌లో ఇలాంటి అక్రమాల్ని తొలగించేందుకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను ఆయన వ్యతిరేకిస్తున్నారు. మహదేవపురాలో ఉన్న సమస్య అన్ని రాష్ట్రాల్లో ఉంది. దీన్ని సరి చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. బీహార్ లో ఈసీ చేస్తున్నది కూడా అదే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి ఓటర్ల జాబితాను సంస్కరిస్తున్నారు.
కానీ బీహార్‌లో ఓటర్లను తీసేస్తున్నారని గగ్గోలు పెడుతున్న రాహుల్. ఇప్పుడు ఓటర్ల జాబితాలో మూడు, నాలుగు ఎంట్రీలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఓటర్ల జాబితాలను పూర్తి స్థాయిలో సంస్కరించేందుకు దేశమంతా ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టాలనే డిమాండ్ ను రాహుల్ గాంధీ చేయాల్సి ఉంది. ఈ సమస్యకు పరిష్కారం పూర్తి స్థాయిలో ఓటర్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయడం.
గతంలో ఇలాంటి ప్రయత్నం జరిగినప్పుడు రాహుల్ గాంధీ అడ్డుకున్నారు. సుప్రీంకోర్టులో కేసులు వేసి తమ పార్టీకి చెందిన లాయర్లతో వాదింప చేశారు. చివరికి అనుసంధానం చేయకుండా చేశారు. ఇప్పటికీ ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. నాడు చాలా విషయాల్లో తలదూర్చారు. నాటి కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం జారీ చేసిన ఆర్డినెన్స్ ను మీడియా ముందు చింపేసి సొంత ప్రధానమంత్రి అవమానించారు. అంత బలవంతుడు, రాజ్యాంగేతర శక్తిగా ఉన్న నేత ఎందుకు ఓటర్ల జాబితాలో సంస్కరణలు అమలు చేయలేదు?
అన్ని ఆరోపణలు చేయడం, తరువాత రాజ్యాంగం వ్యవస్థకు క్షమాపణలు చేయడం ప్రతిపక్ష నేతకు పరిపాటిగా మారిపోయింది. నిన్నటి వరకూ రాహుల్ గాంధీ ఎక్కువగా ఈవీఎంలను నిందించేవారు. ఈవీఎంలను మేనేజ్ చేసి గెలుస్తున్నారని వాదిస్తూ వచ్చారు. కానీ హఠాత్తుగా ఈవీఎంల గురించి మర్చిపోయారు. ఓటర్ల జాబితాలను తెరపైకి తెచ్చారు.
ఓటములకు కారణాలు వెదుక్కోవడంలో ఉండే సూక్ష్మబుద్ది తమ వైఫల్యాలకు కారణం వెదుక్కోవడంలో ఎందుకు చూపించరో కానీ.. ఈ విషయంలో మాత్రం ప్రజల్ని పెడుతూనే ఉన్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఫలితాలు వచ్చాయని అవే రుజువు అని రాహుల్ వాదించాడనికి వెనుకాడటం లేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికి నాలుగు వందల సీట్లు వస్తాయని అంచనా వేశాయి.
కాంగ్రెస్ పార్టీకి మరోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని లెక్కలు చెప్పాయి. కానీ ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది కదా. మరి ఈ ఫలితాలపై తమకు అనుమానాలు ఉన్నాయని ఎందుకు అనడం లేదు? . ఇంకో పాతిక సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండేది కాదని ఆ పాతిక సీట్లను ఓట్ల చోరీ ద్వారా బీజేపీ గెలుచుకుందని విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు.
భారత ప్రజాస్వామ్య ఎన్నికల గురించి కాస్తంత అయినా అవగాహన ఉంటే ఇలా మాట్లాడరు. ఒక్క ఓటుతో గెలిచిన వారి దగ్గర నుంచి ఆరేడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన వారి వరకూ అందరూ ఉన్నారు. కొద్ది తేడాదో ఓడిపోయామని ఓట్ల చోరీ జరిగిందని అంటారా?. చేతకాని తనానికి ఇంత కన్నా పరాకష్ట ఏముంటుంది?.
ఈవీఎంలపై, ఓటర్ల జాబితాలపై నమ్మకం లేకపోతే తెలంగాణ ఎన్నికల ఫలితాలను రిజెక్ట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే అంతకు ముందు పదేళ్ల పాటు తెలంగాణలో జరిగిన ఏ ఒక్క ఉపఎన్నిలోనూ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. సాధారణ ఎన్నికల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. అంత ఎందుకు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందట జరిగిన మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. మరి ఏడాదిలో ఎలా అధికారంలోకి వచ్చింది ?. ఇక్కడ ఓట్ల చోరీ జరిగిందని ఎందుకు ఫలితాలను రిజెక్ట్ చేయలేదు.
బీహార్‌లో అక్రమంగా వలస వచ్చిన వారిని ఓటు బ్యాంకుగా చూసి దేశ భద్రతకు ముప్పు తెస్తున్నారు. వారిని ఓటర్లుగా మార్చుకుని రాజకీయలబ్ధి పొందాలనుకుంటున్నారు. బెంగాల్లో బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశీ ముస్లింలకు ఆశ్రయం ఇచ్చి వారిని అనధికారికంగా దేశ పౌరుల్ని చేయాలనుకుంటున్నారు. ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని మమతా బెనర్జీ భావిస్తున్నారు.
ఎన్నికల సంఘం అలాంటి వారిని ఓటర్ల జాబితా నుంచి తప్పించకుండా ఉండటానికి ఈ భారీ మైండ్ గేమ్ ఆడుతున్నారు. అందుకే రాహుల్ తాన అంటే.. ఆ పార్టీ మిత్రపక్షాలు తందానా అంటున్నాయి. ఆ పార్టీలు కూడా రాహుల్ చేస్తున్న కుట్రను అర్థం చేసుకోలేకపోతున్నాయి. రాహుల్ గాంధీ ఈసీ విశ్వసనీయతను దెబ్బతీసి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను చావుదెబ్బకొట్టడానికి కుట్ర చేస్తున్నారు.
భారత ప్రజాస్వామ్యానికి నమ్మకమే పునాది. అలాంటి పునాదుల్ని కాపాడేది ఎన్నికల సంఘం. ఆ ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీయడానికి రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో ఉండే చిన్న చిన్న తప్పిదాలను భూతద్దంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ పేరుతో వీధుల్లో నాటకాలు ఆడుతున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వారసుడిగా ఇప్పటి వరకూ ఆ పార్టకి ఒక్క విజయం అందించలేని అసహాయుడు.. నిస్సహాయుడు.. చేతకాని వాడిగా ఉన్న తన ముద్రను, తన వైఫల్యాలను ఎన్నికల సంఘంపై రుద్దాలనుకుంటున్నారు. సరిగ్గా ఓటర్ల జాబితాలు ఉండి ఉంటే తాము గెలిచే వాళ్లమని అనిపించాలని అనుకుంటున్నారు. కానీ రాహుల్ గాంధీ ప్రయత్నం మొదట్లోనే తేలిపోయింది. ఓటర్ జాబితాలో ఉండే చిన్న చిన్న లోపాలతో ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టి ఆయన దేశంపైనే కుట్ర చేస్తున్నారని..దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతోంది.
“నిజమైన భారతీయుడివైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు” అని మన దేశాన్ని కించ పరిచేలా రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ డౌట్ ఇప్పుడు దేశ ప్రజలందరికీ వస్తుంది. ఎందుకంటే భారత అంతర్గత సమస్యలను ప్రపంచం ముందు చర్చకు పెడుతున్నారు. విదేశాలకు వెళ్లి భారత్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారు. అంతర్జాతీయ సమాజంలో పరువుపోయేలా పత్రికల్లో ఆర్టికల్స్ రాయిస్తున్నారు.
భారత్ పై ఈర్ష్యతో రగిలిపోయే దేశాలకు రాహుల్ ఓ ఆయుధంగా మారిపోయారు. రాహుల్ నిజమైన భారతీయుడైతే మన దేశ ప్రజాస్వామ్య పునాదులపై ఎందుకు కుట్ర చేస్తారు?. అర్థంపర్థం లేని ఆరోపణలతో ఎందుకు ఈసీపై దాడి చేస్తున్నారు?. దేశమే టార్గెట్‌గా రాహుల్ చేస్తున్న కుట్రను భగ్నం చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం
నిరసనలతో రగిలిపోతున్న నేపాల్… రంగంలోకి సైన్యం