వైసిపి సభ్యులు అసెంబ్లీకి హాజరవుతారా? లేదా?

వైసిపి సభ్యులు అసెంబ్లీకి హాజరవుతారా? లేదా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా? రారా? స్పష్టత ఇవ్వాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.  ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి ముందు తన పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ఆయన  నిలదీశారు. ప్రజాస్వామ్య దేవాలయంకు ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ సభ్యులు ఇచ్చే గౌరవం ఇంతేనా? అని ఆయన ప్రశ్నించారు.
ఈ నెల 17, 18 నుండి అసెంబ్లీ సమావేశాల జరగవచ్చని చెబుతూ భారత దేశంలో ఏ పౌరుడు అయినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే బావుంటుందని, కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయాయో అందరికి తెలుసని అంటూ ఆ రోజు అక్కడ ఒక్క నామినేషన్ వేయలేదని గుర్తు చేశారు.

ప్రతి రోజు అసెంబ్లీలో వైసిపి సభ్యుల కోసం 2 ప్రశ్నలు వస్తాయని,10 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు వారి సభ్యులకు సంఖ్యాపరంగా కేటాయిస్తామని చెప్పారు. అయితే, ఎన్నో మాటలు మాట్లాడే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించడానికి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కారణంగా రెండు ప్రశ్నలు వృద్దా అవుతున్నాయని చెబుతూ తాము అసెంబ్లీకి రమణి చెబితే ఆ ప్రశ్నలను మరో పార్టీకి కేటాయిస్తామని స్పష్టం చేశారు.

సభ్యులు అందరూ అసెంబ్లీకి రావాలి అని కోరుతున్నట్లు చెబుతూ వైసిపి సభ్యులు తమ హాజరుపై ఓ స్పష్టత ఇస్తే దానిపై తాను నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.  గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కేవలం 75 రోజులు మాత్రమే అసెంబ్లీ పనిచేసిందని గుర్తు చేస్తూ  భారతదేశంలో ప్రతి అసెంబ్లీ తక్కువలో తక్కువ 60 రోజులు జరగాలని పాట్నాలో తీర్మానించామని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికీ 31 రోజులు సమావేశాలు జరిగాయని తెలిపారు.