భారత్ ఆత్మ ఫీనిక్స్ లాంటిది

భారత్ ఆత్మ ఫీనిక్స్ లాంటిది
భారత్ ఆత్మ అమరమైన జీవికి ప్రతిరూపమైన ఫీనిక్స్ లాంటిదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే  తెలిపారు. ముంబైలో ఆహ్లాదకరమైన పర్యావరణంలో గల రాంభావు మల్గి ప్రబోధిని సముదాయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.  దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటూ నేడు భారత్ బాహ్య, అంతర్గత భద్రత కోసం పోరాడుతున్న సైనికులతో సహా అన్ని పారామిలిటరీ సైనికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 
శక్తివంతమైన, ధైర్యవంతులైన సైనికుల కారణంగానే దేశ సరిహద్దులు చెక్కుచెదరకుండా ఉన్నాయని స్పష్టం చేశారు.  పురాతన కాలం నుండి, భారత దేశం ఏదైనా సంక్షోభాన్ని అధిగమించి తిరిగి లేచి, పురోగతి సాధించడానికి, మెరుగుపరచడానికి సహజ సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొంటూ భారత్ ఆత్మ ఫీనిక్స్ లాంటిదని ఆయన అభివర్ణించారు.
 
ప్రబోధిని ఉపాధ్యక్షుడు డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే హాజరైన వారిని స్వాగతం పలికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రబోధిని కోశాధికారి నీలేష్ గోసావి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ప్రకాష్ ఆడే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ‘గ్లోబల్ ఔట్రీచ్ ప్రోగ్రామ్’ రాంభావు మల్గి ప్రబోధినిలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సేవకులు, ఆఫీస్ బేరర్లు జెండా ఎగురవేత కార్యక్రమంలో పాల్గొన్నారు.  అందరూ కలిసి భారత మాతను పూజించడం ద్వారా కార్యక్రమాన్ని ముగించారు.