
* విధుల నుండి తొలగించాలని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి రాంబాబు డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల కార్యదర్శి సైఫుల్లా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇస్లాం మత వ్యాప్తిని ప్రోత్సహిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సైఫుల్లాను విధుల నుండి తొలగించాలని ఖమ్మంలో మీడియా సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మైనారిటీ గురుకులాలు ఇస్లాంను వ్యాప్తి చేసే నిలయాలుగా మారాయని, దీనికి ఆ గురుకులాల కార్యదర్శి సైఫుల్లా అధికారికంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
జులై 22న విడుదల చేసిన సర్క్యులర్ లో పిల్లలు ఉదయం ప్రార్థన చేసే సమయంలో ఖురాన్ పఠించాలన , అల్లాహ్ పేరుతో దువా చేయాలని సైఫుల్లా పేర్కోవడం ఇస్లాంను పిల్లలపై బలవంతంగా రుద్దడమే అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలు అంటే కేవలం ముస్లింలు మాత్రమే కాదని క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు వంటి మైనారిటీ మతాల విద్యార్థులు వుంటారని రాంబాబు చెప్పారు. మైనారిటీ గురుకులాల్లో 15 శాతం వరకు హిందూ విద్యార్థులు కూడా విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు.
ఈ మైనారిటీ గురుకులాలను ప్రభుత్వ నిధులతో అధికారికంగా మదరసాల మాదిరిగా ఈ కార్యదర్శి నడిపిస్తున్నారని అంటూ ఆయన మండిపడ్డారు. సైఫుల్లా ప్రభుత్వ కార్యదర్శిగా మాత్రమే కాకుండా మౌల్వి,ముల్లా లాంటి మత ప్రచారకుల్లా వ్యవహరిస్తున్నారని ఎబివిపి నేత దుయ్యబట్టారు. పిల్లల మెదళ్లలో మత మౌడ్యాన్ని నింపే విధంగా అధికారికంగా పనిచేస్తున్న సైఫుల్లాను వెంటనే విధుల నుండి తొలగించాలని, దీనిపై వెంటనే విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదంటే ఈ విషయంలో ప్రభుత్వ హస్తం ఉన్నట్లు అర్థమవుతుందని ఆయన ధ్వజమెత్తారు. ముస్లిమేతర బాల, బాలికలను ఇస్లాం వేషాదారణ కోసం బలవంత పెట్టడం, ఇస్లాం మత ఆచారాలను పాటించాలనడం వారి రాజ్యాంగ హక్కుల్ని హరించడమే అని స్పష్టం చేశారు. ఇస్లాం మత గురువులతో నిత్యం సమావేశాలు ఏర్పాటు చేయడం, ఖురాన్ నేర్పించే బయటి వ్యక్తులకు ప్రభుత్వ నిధులతో జీతాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ దీనిని వెంటనే అరికట్టాలని రాంబాబు డిమాండ్ చేశారు.
సైఫుల్లా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంటూ ఇలాంటి చర్యలకు ఇంత బహిర్గతంగా పాల్పడుతున్నారంటే ఆయన వెనకాల ఏ ఏ శక్తులు పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ విచారణ చేపట్టవాల్సిందిగా ఆయన కోరారు. వెంటనే సైఫుల్లాను కార్యదర్శి విధుల నుండి తొలగించకుంటే ఎబివిపి ఆధ్వర్యంలో చేపట్టబోయే ఉద్యమ పర్యావసనాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాంబాబు హెచ్చరించారు.
కాగా, ఖమ్మం నగరంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, నిషేధిత ఇస్లామిక్ సంస్థల అనుబంధ సంఘాలు, వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖున “సేవ్ గాజా” పేరిట నిర్వహించిన ర్యాలీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, దేశ వ్యతిరేక నినాదాలు చేస్తూ, ఆజాదీ నినాదాలు చేశారని అంటూ ఎబివిపి నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులపై వెంటనే దేశద్రోహ కేసులు పెట్టి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.
పాఠశాల పిల్లలను ఇటువంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన ర్యాలీలో భాగస్వాములను చేసి, పాలస్తీనా జెండాలు పట్టించి దేశ వ్యతిరేక నినాదాలు చేపించడం క్షమించరాని నేరమని అంటూ రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో దేశం యావత్తు భారత ప్రభుత్వంకు, సైన్యంకు మద్దతుగా ఉంటే ఇటువంటి సంఘాలు కనీసం మద్దతు ప్రకటించలేదని ఆయన గుర్తు చేశారు.
ఈ దేశం నీరు తాగుతూ, గాలి పీల్చుతూ, తిండి తింటూ ఈ దేశానికి వ్యతిరేకంగా పని చేయడమే విదేశీ భావజాల కమ్యూనిస్టుల అజెండా అని దుయ్యబట్టారు. మైనారిటీ సంతుష్టీకరణతో ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్ నైజం అంటూ మండిపడ్డారు. ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతున్న స్పందించని ఈ సంఘాలు దేశంలో గందరగోళం సృష్టించడం కోసం ఇలాంటి ర్యాలీలు తీస్తున్నారని పేర్కొంటూ ఇటువంటి ధోరణి ఈ దేశ భద్రతకు ముప్పు అని హెచ్చరించారు.
కావున వెంటనే ఖమ్మం పోలీస్ కమిషనర్ ఈ సున్నితమైన అంశంపై విచారణకు ఆదేశించాలని, బాధ్యులపై యూఏపీఎ కేసులు నమోదు చేయాలని రాంబాబు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సంబంధిత స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, వాటి గుర్తింపును రద్దు చేయాలని ఖమ్మం డిఈఓను డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ అంశంపై ఎబివిపి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, డిఈఓలను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
More Stories
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన