
జాతీయ క్రీడా పరిపాలనా బిల్లు, జాతీయ యాంటీ-డోపింగ్ సవరణ బిల్లులకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆ బిల్లులను క్రీడాశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ సభలో ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రీడల్లో జరిగిన అతిపెద్ద సంస్కరణజాతీయ క్రీడా పరిపాలన బిల్లు అని మంత్రి తెలిపారు. క్రీడాకారులు వైభవోపేతంగా వెలిగిపోవాలన్న ఉద్దేశంతో క్రీడా గవర్నెన్స్ బిల్లును తీసుకువచ్చినట్లు మంత్రి చెప్పారు.
క్రీడా వ్యవహారాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశం కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. యాంటీ డోపింగ్ బిల్లు కూడా కొత్త చట్టమే అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డోపింగ్ విధానాలను ఇది సమర్థిస్తుందన్నారు. పారదర్శకంగా డోపింగ్ చర్యలు చేపట్టే విధంగా చూడనున్నట్లు చెప్పారు. ఒకవైపు బిల్లుపై చర్చ జరుగుతుంటే విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. బీహార్‌లో జరిగిన సిర్ ప్రక్రియపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లులను ఆమోదించారు.
మరోవంక, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో సవరించిన ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు. సవరించిన ఆదాయపు పన్ను బిల్లులో బిజెపి ఎంపీ బైజయంత్ జే పాండా అధ్యక్షతన సెలెక్ట్ కమిటీ చేసిన సిఫార్సులు చాలా వరకు ఉన్నాయి. సెలెక్ట్ కమిటీ ఆదాయపు పన్ను బిల్లుకు 285 సూచనలు చేసింది.
ఆదాయపు పన్ను (నం.2) బిల్లు, 2025ను ప్రవేశపెడుతూ, ఈ బిల్లు ఆదాయపు పన్నుకు సంబంధించిన చట్టాన్ని ఏకీకృతం చేయడానికి, సవరించడానికి ప్రయత్నిస్తుందని, ఆదాయపు పన్ను చట్టం, 1961ని భర్తీ చేస్తుందని సీతారామన్ తెలిపారు. “సెలెక్ట్ కమిటీ సిఫార్సులన్నింటినీ ప్రభుత్వం ఆమోదించింది. అదనంగా, ప్రతిపాదిత చట్టపరమైన అర్థాన్ని మరింత ఖచ్చితంగా తెలియజేసే మార్పుల గురించి వాటాదారుల నుండి సూచనలు అందాయి” అని బిల్లు లక్ష్యాలు, కారణాల ప్రకటన పేర్కొంది.
More Stories
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
ఐపీఎస్ ఆత్మహత్యలో హర్యానా డీజీపీ, ఎస్పీలపై కేసు
కేరళలో ముగ్గురు యుడిఎఫ్ ఎమ్మెల్యేల సైస్పెన్షన్