భూ లావాదేవీలలో రాబర్డ్ వాద్రాకు రూ.58 కోట్లు

భూ లావాదేవీలలో రాబర్డ్ వాద్రాకు రూ.58 కోట్లు

కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు షికోపూర్ భూ లావాదేవీల వ్యవహారంలో రూ.58 కోట్లు ,ముడుపులు దక్కాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజా చార్జీషీట్‌తో వెల్లడించింది. ఇలా వచ్చిన లాభాలను స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎల్‌‌హెచ్‌పీఎల్), బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీబీటీపీఎల్) ద్వారా దారి మళ్లించి లగర్జీ స్థిరాస్తుల కొనుగోళ్ల వైపు మళ్లించినట్టు ఈడీ తెలిపింది. 

ఆస్తుల కొనుగోళ్లు, అప్పుల చెల్లింపులకు ఆయన ఈ డబ్బు వాడారని ఇడి తమ అభియోగ పత్రంలో పేర్కొంది. స్కై లైట్ హాస్పిటాల్టీ ప్రైవేటు లిమిటెడ్ (ఎస్‌ఎల్‌హెచ్‌పిఎల్)నుంచి రూ 53 కోట్లు, రూ 5 కోట్లు బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ కంపెనీ నుంచి ఆయన పుచ్చుకున్నారని ఆరోపించారు. వీటిని స్వప్రయోజనాలకు వాడుకున్నారని తమ పత్రంలో తెలిపారు. పెట్టుబడులకు, స్థిరాస్తుల కొనుగోళ్లకు ఈ సొమ్ము వాడకం జరిగిందని ఛార్జీషీట్‌లో పేర్కొంది.

వాద్రాపై అక్రమ ఆర్థిక లావాదేవీల కేసు 2018 నుంచి సాగుతోంది. ఆయనపైనా, అప్పటి హర్యానా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా, రియల్ ఎస్టేట్ కంపెనీ డిఎల్‌ఎఫ్‌తో పాటు ఒక ప్రాపర్టీ డీలర్‌పైనా ఇడి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. వాద్రాను ఇతరులను ఈ కేసుకు సంబంధించి పలు సార్లు ఇడి విచారించింది. 

సోనియా గాంధీ అల్లుడు అయిన వాద్రాపై ఫోర్జరీ , మోసాలు, అవినీతి వంటి పలు ఆరోపణలు పొందుపర్చారు. గుర్గావ్‌లో వాద్రా ఇతరులు తమ అధికార రాజకీయ పలుకుబడితో పలు ఆస్తులను సొంతం చేసుకున్నారు. ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 2008 ఫిబ్రవరిలో అతి చవకగా రూ 7.5 కోట్లకు మూడున్నర ఎకరాల భూమి కొనుగోలు చేసి, దీనిని తరువాత డిఎల్‌ఎఫ్ రియల్ ఎస్టేట్ సంస్థకు రూ 58 కోట్లకు అమ్మారని ఇడి తమ అభియోగాలలో తెలిపింది. 

ఇదంతా కూడా పెద్ద ఎత్తున జరిగిన మనీలాండరింగ్ వ్యవహారం అని అప్పట్లో తెలిపారు. ఈ అంశాన్ని ఇప్పుడు పొందుపర్చిన ముడుపుల విషయాన్ని వేర్వేరుగా ఇడి విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 15, 16 తేదీల్లో రాబర్డ్ వాద్రాను ఈడీ ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఈడీ ప్రశ్నలకు వాద్రా నేరుగా సమాధానం ఇవ్వకుండా ముగ్గురు చనిపోయినవారు తన తరఫున ఈ లావాదేవీలు జరిపారని చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

తన వాదనకు మద్దతుగా ఆయన ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించలేదని సమాచారం. ఈడీ చెబుతున్న దాని ప్రకారం వాద్రాకు చెందిన కంపెనీ 2008 ఫిబ్రవరిలో గురుగ్రామ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ డీఎల్‌ఎఫ్‌కు రూ.58 కోట్లకు విక్రయించింది. ఈ డీల్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి.

అయితే, వాద్రా కుటుంబం మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తుంది. తాను గాంధీ కుటుంబం వాడిని కావడం వల్లే తనను టార్గెట్ చేసుకున్నారని వాద్రా ఓ సందర్భంలో కామెంట్ చేశారు. తాను బీజేపీలో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండి ఉండేదని పేర్కొన్నారు.