గాజా స్వాధీనంకు ఇజ్రాయిల్ భద్రతా క్యాబినెట్ ఆమోదం

గాజా స్వాధీనంకు ఇజ్రాయిల్ భద్రతా క్యాబినెట్ ఆమోదం

హమాస్ రెబెల్స్‌ కు, ఇజ్రాయెల్‌ సైన్యానికి మధ్య దాదాపు 23 నెలలుగా యుద్ధం కొనసాగుతుండగా, గాజా సిటీని పూర్తిగా స్వాధీనం చేసుకోవడం కోసం ఇజ్రాయెల్ రూపొందించిన ప్రణాళికకు ఆ దేశానికి చెందిన భద్రతా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తాజా పరిణామంతో గాజాలో సైనిక కార్యకలాపాలు మరింత విస్తృతం కానున్నాయి. సమావేశానికి ముందు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుమాట్లాడుతూ “మా భద్రతను ప‌టిష్టం చేసుకునేందుకు, హమాస్‌ను పూర్తిగా తొలగించేందుకు, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించేందుకు గాజా మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది” అని ప్రకటించారు. 

అయితే గాజాను శాశ్వతంగా అట్టిపెట్టుకునే ఉద్దేశం తమకు లేదని, అక్కడ ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, సరైన రీతిలో పాలించగల అరబ్ దళాలకు పాలనా బాధ్యతలు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు.  కాగా నెతన్యాహు వ్యాఖ్యలపై హమాస్ తీవ్రంగా మండిపడుతూ చర్చల ప్రక్రియను దెబ్బతీసేందుకే ఇజ్రాయెల్ ప్రధాని ఈ ప్రకటన చేశారని, యుద్ధం వెనుక ఉన్న ఆయన నిజమైన ఉద్దేశాలు ఇప్పుడు బయటపడ్డాయని ఆరోపించింది.

కాగా, గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఇజ్రాయిల్‌ ప్రభుత్వ ప్రణాళికను వెంటనే విరమించుకోవాలని  యుఎన్‌ మానవహక్కుల చీఫ్‌ వోల్కర్‌ టర్క్‌ హెచ్చరించారు. ఇజ్రాయిల్‌ తన  ఆక్రమణను వీలైనంత త్వరగా నిలిపివేయాలని కోరారు. ఈ ప్రణాళిక రెండు దేశాల పరిష్కారం, పాలస్తీనియన్ల స్వయం నిర్ణయాధికార హక్కును సాధించాలనే తీర్పుకు విరుద్ధంగా ఉందని టర్క్‌ పేర్కొన్నారు.

పూర్తి అడ్డంకులు లేని మానవతా సాయం పంపిణీని గాజాలోకి అనుమతించాలని స్పష్టం చేశారు.  హమాస్‌ బేషరతుగా బంధీలను విడుదల చేయాలని, ఇజ్రాయిల్‌ కూడా ఏకపక్షంగా నిర్బంధించిన పాలస్తీనియన్లను వెంటనే విడుదల చేయాలని ఆయన స్పష్టం చేశారు.  మరోవైపు గాజాలో మానవతా సంక్షోభం కూడా రోజురోజుకు తీవ్రమవుతోంది. 2023 అక్టోబర్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 61,258 మంది పాలస్తీనియన్లు మరణించగా,1,52,045 మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య అధికారులు గురువారం తెలిపారు.

ఇజ్రాయెల్ దిగ్బంధనం కారణంగా గాజాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ నేపథ్యంలో యూఏఈ, జోర్డాన్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ దేశాలు బుధవారం 107 సహాయక ప్యాకేజీలను విమానాల ద్వారా గాజాలో జారవిడిచాయి. అయితే భూమార్గాల ద్వారా పెద్ద ఎత్తున సహాయాన్ని అనుమతిస్తే తప్ప, ఈ ఎయిర్‌డ్రాప్స్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఐక్యరాజ్యసమితి అధికారులు అంటున్నారు.

మానవతా సాయం అందించేందుకు వీలుగా జూలై 27 నుంచి గాజాలోని జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సైనిక కార్యకలాపాలకు ‘వ్యూహాత్మక విరామం’ పాటిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. డేర్ అల్-బలా, అల్-మవాసి, గాజా సిటీ వంటి ప్రాంతాల్లో ఈ విరామాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.