
భారత్ – చైనా దేశాల మధ్య సంబంధాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెలాఖరులో టియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్పీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం చైనా అధికారికంగా ఆహ్వానం పలికింది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ తొలిసారి చైనాలో పర్యటించనున్నారు.
కాగా భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్ సహా మొత్తం పది దేశాలు సభ్యులుగా ఉన్న షాంఘై సహకార సంస్థను 2001లో స్థాపించారు. ఈ ఏడాది టియాంజిన్‌లో జరిగే సదస్సు ఎస్సీఓ చరిత్రలోనే అతిపెద్ద సదస్సుగా నిలవనుందని చైనా వెల్లడించింది. సుమారు 20 దేశాల అధినేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 2019లో చివరిగా ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు.
గతేడాది రష్యా వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. చైనాలో ఈ ఏడాది జూన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం, పహల్గాం ముష్కర దాడులను ప్రస్తావించకపోవడంపై తీవ్రంగా పరిగణించారు.
ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు కూడా నిరాకరించారు. దీంతో ఎలాంటి ఉమ్మడి ప్రకటన లేకుండానే నాటి చర్చలు ముగిశాయి. అనంతరం జులైలో జరిగిన విదేశాంగ మంత్రుల సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?