ఎస్ఐఆర్ ముసాయిదాపై ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పలేదు

ఎస్ఐఆర్ ముసాయిదాపై ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పలేదు

బిహార్​లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై ఆగస్టు 1వ తేదీన విడుదల చేసిన ఓటర్ల జాబితా ముసాయిదాకు ఏ రాజకీయ పార్టీ కూడా అభ్యంతరాలు తెలపలేదని భారత ఎన్నికల సంఘం గురువారం పేర్కొంది. ఓటుకు అర్హత ఉన్నవారిని వదలిపెట్టబోమని, అనర్హులను ఓటరు లిస్టులో చేర్చబోమని స్పష్టం చేసింది.  ఇప్పటివరకు ఓటరు ముసాయిదా జాజితాకు సంబంధించి 5,015 అభ్యంతరాలను స్వీకరించామని ఎన్నికల సంఘం చెప్పింది.

కొత్త ఓటర్ల నుంచి 27,517 పైగా దరఖాస్తులను స్వీకరించామని ఈసీ తెలిపింది. ముసాయిదా జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమకు చెప్పాలని కోరింది.  నిబంధనల ప్రకారం, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల గడువు ముగిసిన తర్వాత సంబంధిత ఎలక్ట్రోలర్​​, అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు వాటిని పరిష్కరించాలి. అదే సమయంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ బిహార్ రాజకీయాల్లో​ తీవ్ర వివాదానికి దారితీసింది. ఎన్నికల సవరణలో పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగింపు జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో కూడా ఎస్​ఐఆర్​పై గళమెత్తాయి. పార్లమెంట్​ ఆవరణలో నిరసనలు కూడా తెలిపాయి. ఇదిలా ఉండగా, బిహార్​ ఓటరు జాబితాలో 65 లక్షల ఓటర్ల పేర్లు చేర్చలేదని తేలింది. దీంతో వారి వివరాలను బహిర్గతం చేయాలని ఎన్​జీవో ఏడీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. 

దీనిపై ఆగస్టు 9లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్​జీవో తరఫున కోర్టులో హాజరైన న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ తన వాదనలు వినిపించారు. ఎవరు చనిపోయారు, ఎవరు వలసవెళ్లారనే దానిపై స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. తొలగించిన ఓటర్ల వివరాలను, ఎన్​జీవో కాపీని ఇవ్వాలని ఎన్నికల తరఫున న్యాయవాదిని ధర్మాసనం పేర్కొంది.

కొన్ని రాజకీయ పార్టీలకు తొలగించిన ఓటర్ల జాబితాను ఇచ్చామని, అయితే ఆ ఓటరు చనిపోయాడా లేదా వలస వెళ్లాడా అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదని ప్రశాంత్ భూషణ్ తెలిపారు. అయితే ఓటర్లు తమ ఎపిక్ నంబర్‌లను ఉపయోగించి అధికారిక లింక్ ద్వారా తమ పేర్లను తెలుసుకునే అవ కాశాన్ని కమిషన్ కల్పించింది.  ఆ పోర్టల్ ద్వారా పేర్లను చేర్చడం లేదా తొలగించడం, అభ్యంతరాలు ఉంటే తెలియజేయడం వంటివి చేయవచ్చు. 2025 సెప్టెంబర్​ 1వ తేదీ నాటికి ఓటర్లందరూ తమ బూత్ లెవల్ అధికారులకు కొత్త ఫొటోలను సమర్పించాలని ఈసీ కోరింది.