పార్ల‌మెంట్‌లో బీహార్ సిర్‌పై చ‌ర్చించ‌లేం

పార్ల‌మెంట్‌లో బీహార్ సిర్‌పై చ‌ర్చించ‌లేం
* బీహార్ లో తొలగించిన ఓటర్ల వివరాలు కోరిన సుప్రీం

బీహార్‌లో చేప‌ట్టిన ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌ (ఎస్ఐఆర్)పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని పార్ల‌మెంట్‌లో విప‌క్షాలు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బుధవారం కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ అందుకు తిరస్కరించారు. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ అంశంపై పార్ల‌మెంట్‌లో చ‌ర్చించ‌డం అంటే, అన్ని నియ‌మాల‌ను ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌ని ఆయ‌న స్పష్టం చేశారు. 

స‌భ స‌జావుగా సాగేందుకు విప‌క్ష ఎంపీలు స‌హ‌క‌రిచాల‌ని ఆయ‌న కోరారు. స‌భా కార్య‌క్ర‌మాను అడ్డుకోరాద‌ని హితవు చెప్పారు. మ‌నం చ‌ర్చించ‌డం కోసం చాలా ముఖ్య‌మైన విష‌యాలు ఉన్నాయ‌ని పేర్కొంటూ జాతీయ క్రీడా విధాన్ని తామేమీ ప్ర‌వేశ‌పెట్ట‌డంలేద‌న్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనేది వ్య‌క్తిగ‌త వ్య‌వ‌స్థ అని, సుప్రీంకోర్టులో ఆ కేసు ఉంద‌ని, ఆ అంశాల‌ను పార్ల‌మెంట్‌లో డిస్క‌స్ చేయ‌లేమ‌ని మంత్రి రిజిజు తెలిపారు.

విప‌క్ష స‌భ్యుల ప‌ట్ల ప్ర‌భుత్వం చిన్నచూపు చూస్తోంద‌ని మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ఆరోపించారు. ప్ర‌తి ఒక్క‌రు ఒకే ర‌క‌మైన రూల్స్ పాటించాల‌ని కోరారు. పాయింట్ ఆఫ్ ఆర్డ‌ర్ అడిగినందుకు స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని ఖ‌ర్గే విమర్శించారు. స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టిస్తున్న‌వారికి స‌భ‌లో మాట్లాడే హ‌క్కులేద‌ని జేపీ న‌డ్డా తెలిపారు. అయినా కానీ బీహార్ సిర్ ప్ర‌క్రియ‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్ష స‌భ్యులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

కాగా, బీహార్‌లో ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ త‌ర్వాత జాబితా నుండి తొలగించిన సుమారు 65 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌ వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆగ‌స్టు 12 లేదా 13వ తేదీల్లో బీహార్ సిర్ ప్ర‌క్రియ‌పై సుప్రీంకోర్టులో మ‌ళ్లీ విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో తొల‌గించిన ఓట‌ర్ల వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేయాల‌ని సుప్రీంకోర్టు చెప్పింది.

జ‌స్టిస్ సూర్య కాంత్‌, జ‌స్టిస్ ఉజ్వ‌ల్ భూయాన్‌, జ‌స్టిస్ ఎన్ కోటీశ్వ‌ర్ సింగ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ ఆదేశాలు ఇచ్చింది. తొలగించిన ఓట‌ర్ల వివ‌రాల‌ను ఇప్ప‌టికే రాజ‌కీయ పార్టీల‌కు స‌మ‌ర్పించార‌ని, అయితే ఆ వివ‌రాల‌ను బ‌హిరంగంగా వెల్ల‌డించాల‌ని, ఈ కేసులో పిటీష‌న్ వేసిన అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్‌కు కూడా ఓ కాపీని ఇవ్వాల‌ని ధ‌ర్మాస‌నం ఆదేశించింది. 

శ‌నివారం లోగా సమాధానం న‌మోదు చేయాల‌ని, ఏడీఆర్‌కు చెందిన ప్ర‌శాంత్ భూష‌ణ్ దాన్ని ప‌రిశీలిస్తార‌ని, అప్పుడు ఏ విష‌యాన్ని వెల్ల‌డించాలి, వెల్ల‌డించ‌కూడ‌దో తెలుస్తుంద‌ని బెంచ్ తెలిపింది.