ఆపరేషన్ సిందూర్​పై చర్చ కోరి దెబ్బతిన్న ప్రతిపక్షాలు

ఆపరేషన్ సిందూర్​పై చర్చ కోరి దెబ్బతిన్న ప్రతిపక్షాలు
పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’పై పార్లమెంట్​లో చర్చకు డిమాండ్ చేసి ప్రతిపక్షాలు తప్పు చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. గత వారం పార్లమెంట్​లో ఆపరేషన్ సిందూర్​పై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఎద్దేవా చేశారు.  అలాగే విపక్ష పార్టీలు తమను తామే దెబ్బతీసుకున్నాయని, స్వీయ హాని చేసుకోవాలని పట్టుపట్టాయని విమర్శించారు.
మంగళవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి దాడి, ఆపరేషన్‌ సిందూర్‌లపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగింది. ఈ డిబేట్​లో విపక్షాలు ఉభయసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.  ముఖ్యంగా భద్రతలో, విదేశాంగ విధానంలో వైఫల్యాలను ప్రస్తావించి ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిలదీశాయి. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అధికార పక్షం వైపు నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నడ్డా వారి విమర్శల్ని సమర్థంగా ఎదుర్కొని తిప్పికొట్టారు.  దీంతో ఉభయసభల్లో వాగ్వాదాలు జరిగాయి. చివర్లో మోదీ విపక్షాల పాలనలో జరిగిన తప్పిదాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. భారత్‌-పాక్‌ యుద్ధాన్ని నిలువరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదేపదే చెప్పడంపై విపక్షాల విమర్శలకు జవాబిచ్చారు.

 ఎన్డీఏ సమావేశానికి హాజరైన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ‘ఆపరేషన్ సిందూర్’, ‘ఆపరేషన్ మహాదేవ్‌’లు విజయవంతమైన నేపధ్యంలో ఎన్డీఏ నేతలు ప్రధాని మోదీని హర్షద్వానాలతో ఆహ్వానించారు.  ‘హర్ హర్ మహాదేవ్’ అంటూ నినాదాలు కూడా చేశారు. పాక్​లోని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైనందుకు గాను మోదీని ఎన్డీయే నేతలు సత్కరించారు. అలాగే ఆయన నాయకత్వాన్ని కొనియాడారు. అలాగే ఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక తీర్మానం చేశారు ఎన్డీఏ ఎంపీలు.

ప్రధాని మోదీ అచంచలమైన సంకల్పం, దార్శనిక, రాజనీతిజ్ఞత, దృఢ సంకల్పం దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని ఎన్డీఏ ఎంపీలు తీర్మానంలో పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సాయుధ దళాల ధైర్యం, అచంచలమైన నిబద్ధతకు కూడా వారు సెల్యూట్ చేశారు.  భారత సైనికులు దేశాన్ని రక్షించడంలో వారి అచంచలమైన అంకితభావాన్ని కనబర్చారని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలే లక్ష్యంగా కచ్చితత్వంగా దాడులు చేసిందని అన్నారు. అలాగే పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి సంతాపం తెలిపారు.