మూలపేట పోర్టు సమీపంలో శాటిలైట్‌ షిప్‌యార్డు

మూలపేట పోర్టు సమీపంలో శాటిలైట్‌ షిప్‌యార్డు

హిందుస్తాన్‌ షిప్‌యార్డు (హెచ్‌ఎస్‌ఎల్‌) విస్తరణలో భాగంగా శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు సమీపంలో శాటిలైట్‌ షిప్‌యార్డును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి 150 నుంచి 200 ఎకరాల భూమి కోసం ప్రతిపాదన చేశామని హిందుస్తాన్‌ షిప్‌యార్డు సిఎమ్‌డి డాక్టర్‌ హేమంత్‌ ఖత్రి తెలిపారు. రాష్ట్రంలోని కాకినాడ పోర్టు వద్దనైనా భూమిని తాము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి తెలియజేశామని చెప్పారు. 

విశాఖలోని షిప్‌యార్డులో బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లతో కలిసి మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాగల రెండేళ్లలో రూ.3 వేల కోట్ల టర్నోవర్‌ను సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సబ్‌ మెరైన్‌ల రీఫిట్‌, రిపేర్లలో నాణ్యత, సకాలంలో డెలివరీలో దేశంలోని షిప్‌యార్డుల్లో నెంబర్‌ వన్‌గా ఉన్నామని చెప్పారు. 2017లో సింధుకీర్తి సబ్‌మెరైన్‌ విశాఖకు వస్తే 2021 జులైలో దీన్ని విజయవంతంగా పూర్తి చేసి పంపామని తెలిపారు.

దేశంలోని రక్షణ రంగానికి, నేవీ, పోర్టు, ఒఎన్‌జిసి, డిసిఐకి అవసరమైన నౌకలు, ఫ్లీట్‌ సపోర్టు షిప్‌లు, టగ్‌లను నిర్మించడంలో హెచ్‌ఎస్‌ఎల్‌ విశేష కృషి చేసిందని వివరించారు.  విశాఖ షిప్‌యార్డుకు విదేశాలతో వ్యాపార లావాదేవీల విషయంలో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వియత్నాం సహా అనేక దేశాలతో సబ్‌మెరైన్ల రిపేర్లు, రీఫిట్‌ల విషయమై ఎంఒయులు చేశామని చెప్పారు. గడిచిన నాలుగేళ్లలో 25 సబ్‌మెరైన్లను రీఫిట్‌ చేసినట్లు వెల్లడించారు. 

లాక్‌డౌన్‌ కాలంలోనూ పనుల నిర్వహణను ఆపకుండా చేయడంతో 2025 నాటికి ‘మినీరత్న’ హోదాను షిప్‌యార్డు సాధించిందని తెలిపారు. దేశంలోని మిగతా షిప్‌యార్డుల కంటే జీరో విజిలెన్స్‌, జీరో డిసిప్లిన్‌ కేసులు నమోదైన నౌకానిర్మాణ కేంద్రంగా విశాఖ ఘనత సాధించిందని చెప్పారు. విశాఖలో హెలికాప్టర్లు ల్యాండింగ్‌ అయ్యేందుకు వీలుగా వచ్చే ఏడాది 250 మీటర్ల పొడవైన ల్యాండింగ్‌ ప్లాట్‌ ఫాంలు, డాక్‌ల నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు.

గడచిన నాలుగేళ్లలో విశాఖ షిప్‌యార్డు బలమైన కేంద్రంగా అవతరించిందని, 40 ఏళ్లలో ఎప్పుడూలేని టర్నోవర్‌, ఆదాయం సమకూర్చుకుందని హేమంత్‌ ఖత్రి తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.403 కోట్ల ఆదాయం ఉండగా 2024-2025లో రూ.1783 కోట్ల ఆదాయానికి చేరుకుందని వివరించారు. 2020-2021లో లాభం కేవలం రూ.51 కోట్లు ఉండగా 2024-25లో రూ.284 కోట్లు ఆర్జించామని చెప్పారు. రాగల కాలంలో రూ.9 వేల కోట్లు రిపేర్లు, రీఫిట్‌ ఆర్డర్లు రాబోతున్నాయని వెల్లడించారు.