
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన ప్రాంతం తిరుమల. శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. అదేవిధంగా తమకు తోచిన విధంగా కానుకలు సమర్పిస్తారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి మృతి చెందిన మాజీ ఐఆర్‌ఎస్ అధికారి భాస్కర్‌రావు స్ఫూర్తితో హైదరాబాద్‌కు చెందిన దంపతులు తమ ఇంటిని విరాళంగా ఇచ్చారు.
ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోకు సంబంధిత పత్రాలను అందజేశారు. మల్కాజ్‌గిరిలోని వసంతపురి కాలనీకి చెందిన టి. కనకదుర్గ ప్రసాద్, సునీతా దేవి దంపతులు. వారికి సంతానం లేదు. తమ తదనంతరం 250 గజాల స్థలంలోని ఇల్లు శ్రీవారికి చెందేలా వీలునామా రాసి స్వామిపై అపారమైన భక్తిని చాటుకున్నారు.
ఇటీవల మాజీ ఐఆర్‌ఎస్ అధికారి భాస్కర్‌రావు వీలునామా ద్వారా రూ.3 కోట్ల విలువైన ఇల్లు, రూ.66లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను విరాళంగా ఇచ్చారు. ఆయన తరఫున ట్రస్ట్ ప్రతినిధులు సంబంధిత పత్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందజేశారు. ఆయన నుంచి స్ఫూర్తి పొందిన మల్కాజ్‌గిరికి చెందిన దంపతులు తమ ఇంటికి సంబంధించిన ఆస్తి పత్రాలను తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరికి అప్పగించారు.
స్వామివారిపై అపారమైన భక్తితో ఇంటిని విరాళంగా ఇవ్వడం ఇతర భక్తులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని వెంకయ్యచౌదరి కొనియాడారు. టి.కనకదుర్గ ప్రసాద్, సునీతా దేవి దంపతులను ఆయన అభినందించారు.
మరోవైపు తాజాగా వెంకటేశ్వరస్వామికి చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి దాతలు వీటిని అప్పగించారు. 2.5 కిలోల బంగారంతో రూపొందించిన వీటి విలువ రూ.2.4 కోట్లు ఉంటుందని దాతలు తెలిపారు.
అదేవిధంగా మైసూరు రాజమాత ప్రమోదాదేవి రెండు భారీ వెండి అఖండాల (అఖండ దీపాలు)ను శ్రీవారి ఆలయానికి విరాళం సమర్పించారు. ఒక్కో వెండి అఖండం బరువు సుమారు 50 కిలోలు కాగా, రెండూ కలిపి 100 కిలోల బరువు ఉంటాయని అధికారులు గతంలోనే వెల్లడించారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు