28న లోక్‌సభ లో ఆపరేషన్‌ సిందూర్‌ పై చర్చ

28న లోక్‌సభ లో ఆపరేషన్‌ సిందూర్‌ పై చర్చ

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితాకుప్రత్యేక నిశిత సవరణ (సర్‌) చేపట్టడం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ప్రకటించడం వంటి అంశాలు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్నాయి. 

వారి ఆందోళనలతో  పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వరుసగా ఐదవరోజు శుక్రవారం కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. దీంతో సభలో నిరసనలకు బ్రేక్‌ వేసేందుకు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో అర్థవంతమైన చర్చలు జరిపేందుకు సహకరించాలని ప్రతిపక్ష నాయకులను స్పీకర్‌ కోరినట్లు తెలిసింది. 

దీంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష ఎంపీలు చెప్పినట్లు సమాచారం. దీంతో సోమవారం నుంచి లోక్‌సభ కార్యకలాపాలూ సజావుగా సాగనున్నాయని సమాచారం.  సమావేశం తర్వాత, ఏకాభిప్రాయం కుదిరిందని అన్నారు.  లోక్‌సభ ఆపరేషన్‌ సిందూర్‌ గురించి సోమవారం (జులై 28న) చర్చ జరపనున్నట్లు తెలిపారు. మరోవంక రాజ్యసభ ఈ అంశంపై మంగళవారం చర్చ జరపనుంది. 

లోక్‌స‌భ‌ లో 16 గంటల పాటు, రాజ్యసభలో 16 గంట‌ల పాటు చ‌ర్చించేందుకు స‌మ‌యాన్ని కేటాయించారు. కాగా, రాజ్యసభలో ముందుగా సభ ప్రారంభమైన వెంటనే తమిళనాడు నుండి కొత్తగా ఎన్నికైన కమల్‌హాసన్‌, రాజాతి, ఎస్‌.ఆర్‌.శివలింగం, పి.విల్సన్‌లు ప్రమాణస్వీకారం చేశారు. రెండు సభలలో చర్చను రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభిస్తారు. లోక్ సభలో జరిగే చర్చలో హోం మంత్రి అమిత్ షా, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్, బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే పాల్గొంటారని పార్టీ వర్గాలవారు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ లోక్ సభలో చ ర్చ సందర్భంగా జోక్యం చేసుకునే అవకాశం ఉంది.

అలాగే రాజ్యసభలోనూ చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. మంగళవారం నాడు రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్ పై జరిగే చర్చలో విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తోపాటు పలువురు ఎంపీలు పాల్గొంటారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ పాల్గొంటారు.

అఖిల పక్షం సమావేశంలో ప్రతిపక్షాలు ఆపరేషన్ సిందూర్, బీహార్ లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ, ఇతర అంశాలపై చర్చించాలని కోరాయని, అయితే అన్ని అంశాలనూ కలిసి చర్చించలేమని మంత్రి రిజిజు స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ పై ముందు చర్చ చేపడతామని, ఆ చర్చ తర్వాత ఇతర అంశాలపై తాము నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు.