
భారత సాయుధ దళాల డ్రోన్ యుద్ధతంత్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని కర్నూలు జిల్లాలో పరీక్షించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని యూఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ (యూఎల్‌పీజీఎం)-వీ3గా వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజి (ఎన్‌వోఏఆర్)లో ఈ ప్రతిష్ఠాత్మక పరీక్ష జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ప్రకటించారు.
ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోను ఆయన ఎక్స్లో పంచుకున్నారు. డీఆర్‌డీవో, ఈ క్షిపణి అభివృద్ధి, తయారీలో భాగస్వాములైన ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్స్‌ను రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతోపాటు ఉత్పత్తి చేయగలిగే సత్తా భారత్‌కు ఉందని ఈ పరీక్ష నిరూపించిందని ఆయన కొనియాడారు. అయితే యూఎల్‌పీజీఎం‑వీ3కి సంబంధించిన సాంకేతిక అంశాలను బహిర్గతం చేయలేదు.
గతంలో డీఆర్‌డీవో పత్రాలు, ఓపెన్ సోర్స్ సమాచారం ప్రకారం గతంలో పరీక్షించి యూఎల్‌పీజీఎం‑వీ2 ప్లాట్‌ఫామ్ పైనే దీనిని అభివృద్ధి చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలో డీఆర్‌డీవోకు చెందిన ఎన్‌వోఏఆర్ పరీక్ష కేంద్రాన్ని దీనికి ఎంచుకున్నారు. గతంలో కూడా ఇక్కడ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ వ్యవస్థను పరీక్షించేందుకు ఇదే వేదికను వాడారు. ఈ ఆయుధం ఫిక్స్‌డ్‌వింగ్ మానవ రహిత విమానాలను కూల్చేందుకు ఉపయోగిస్తారు.
ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలతో భారత్ డ్రోన్ యుద్ధతంత్రంలో ముందడుగు వేస్తోంది. దాదాపు 2,200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ రేంజి డీఆర్‌డీవో అధీనంలోని ఎన్‌వోఏఆర్ అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రేంజి. దీనిని 2016-17లో ప్రారంభించారు. సాధారణంగా ఇండోర్ పరీక్షించే ఈడబ్ల్యూ ఆయుధాలు అందుబాటులోకి రావాలంటే 2 ఏళ్లు పడుతుంది.
కానీ, బాహ్య ప్రదేశాల్లో పరీక్షించేవి వేగంగానే దళాల్లోకి చేరే అవకాశం ఉంటుంది. ఇక్కడ పరీక్షించే ఆయుధాల్లో రాడార్లు, ట్రాన్స్‌మీటర్లు, యాంటెన్నాలు, సెన్సర్లు, కమ్యూనికేషన్ పరికరాలతోపాటు డైరెక్ట్ ఎనర్జీ (లేజర్) వెపన్స్ కూడా ఉంటున్నాయి. ఎల్‌పీజీఎం శ్రేణి ఆయుధాలను తపస్-బీహెచ్, ఆర్చర్ ఎన్‌జీ యూఏవీల కోసం అభివృద్ధి చేశారు. ఇది చాలా తక్కువ ధరతో ఉత్పత్తి చేయవచ్చు. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి. అత్యంత సమీపం నుంచి జరిగే పోరాటాల్లో ఫైర్ అండ్ ఫర్‌గెట్ వ్యవస్థ ఆధారంగా దీనిని ఉపయోగించవచ్చు.
కాగా ఈ క్షిపణి ప్రయోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందిస్తూ మన దేశ రక్షణ వ్యవస్థ వృద్ధికి ఆంధ్రప్రదేశ్ దోహదపడటం గర్వకారణంగా ఉందని తెలిపారు. నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ వద్ద యూఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి విజయవంతమవటం శుభపరిణామమని తెలిపారు. శాస్త్రవేత్తలు ఆవిష్కర్తలకు అభినందనలు చెప్పారు. ఇది మన దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని వెల్లడించారు. యూఎల్‌పీజీఎం‑వీ3 విజయం ఆత్మనిర్భర్ భారత్ యొక్క నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు.
More Stories
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
ఆంగ్లేయుల గురించి ఏనాడూ భ్రమలు లేవు, రాజీ పడింది లేదు