
ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోందన్న ఐఎండీ పేర్కొంది. దీంతో రాబోయే నాలుగైదు రోజుల పాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అమరావతి వాతావరణ విభాగం హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అత్యధికంగా సాయంత్రం 6 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డైంది. అదే విధంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మాయాపట్నం గ్రామాన్ని రాకాసి అలలు చుట్టుముట్టాయి. దీంతో సుమారు 70 ఇళ్లు ముంపులోనే చిక్కుకున్నాయి. తీరానికి సమీపంలో ఉన్న ఇళ్లు నేలకూలగా, మరో 30 గృహాలు కోతకు గురై సముద్రంలో కలిసిపోనున్నాయి. ప్రజలను రక్షించేందుకు రెవెన్యూ, అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
సముద్రపు నీటిని మళ్లించేందుకు మార్గం ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతోంది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద బుధవారం సాయంత్రానికి 27.90 మీటర్లకు నీటిమట్టం చేరింది. 48 గేట్ల ద్వారా గోదావరిలోకి 1.84 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా కుడికాలువకు నీటి సరఫరా నిలిపివేశారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు