నలుగురు అల్‌ ఖైదా ఉగ్రవాదులు అరెస్ట్

నలుగురు అల్‌ ఖైదా  ఉగ్రవాదులు అరెస్ట్

అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ భారత్‌లో భారీ దాడులకు ప్లాన్ చేసింది. అయితే అల్‌ ఖైదా కుట్రను గుజరాత్‌ కు చెందిన ఏటీఎస్‌ పోలీసులు భగ్నం చేశారు. అల్ ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరిని గుజరాత్‌లో అరెస్ట్ చేయగా, ఒకరిని ఢిల్లీలో, మరొకరిని నోయిడాలో అదుపులోకి తీసుకున్నారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్‌లోని పలు ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. అల్ ఖైదాకు సంబంధించిన ఉగ్రవాద శిబిరాలపై కూడా భారత ఆర్మీ దాడులకు పాల్పడింది. ఆ సంస్థకు చెందిన పలువురు ప్రముఖులను మట్టుబెట్టింది. దాంతో అప్పట్లోనే అల్ ఖైదా భారత్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇండియన్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు అప్రమత్తయ్యారు.

దేశంలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచారు. ఫలితంగా ఇప్పటికే పలు ఉగ్రకుట్రలు భగ్నం అయ్యాయి. తాజాగా మరో నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నలుగురు ఉగ్రవాదులను మహమ్మద్‌ ఫైక్‌, మహమ్మద్‌ ఫర్దీన్‌, సెఫుల్లా కురేషి, జీషన్‌ అలీగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిని అధికారులు విచారిస్తున్నారు. 

వీరంతా 20-25 ఏళ్ల లోపు వారేనని, దేశంలో భారీ కుట్రలకు వీరు ప్లాన్ చేశారని గుజరాత్ పోలీసులు తెలిపారు. వీరు సోషల్‌ మీడియాలో ఒకరితో ఒకరు సంబంధాలు నెరపుతున్నట్టు గుర్తించామని, తదుపరి విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా, ఢిల్లీ పోలీసులు సైతం గతేడాది ఆగస్టులో అల్‌ఖైధా అనుబంధ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టురట్టు చేశారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో 14 మందిని అరెస్టు చేశారు. వీరికి వివిధ రకాల ఆయుధాల వాడకంలో శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు.