పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చకు లోక్ సభ, రాజ్యసభలో విపక్షాలు పట్టుపట్టాయి. భారత్ – పాక్ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 24 సార్లు చేసిన వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డాయి. దీనిపై పార్లమెంటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ చీఫ్, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’లపై చర్చ కోసం రూల్ 267 కింద వారు రాజ్యసభలో వాయిదా నోటీసులను అందించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలపై చర్చలో పాల్గొనేందుకు నిరాకరించారు. పహల్గామ్ ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’లపై రెండు రోజుల పాటు ఉభయ సభల్లో చర్చించాలని జీరో అవర్‌లో ఖర్గే డిమాండ్ చేశారు. దీనిపై విపక్ష ఎంపీలంతా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది.12 గంటలకు రాజ్యసభలో క్వశ్చన్ అవర్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు.
ఈక్రమంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను నేటికీ గుర్తించలేదని గుర్తు చేశారు. ఉగ్రదాడి జరిగిన రోజున (ఏప్రిల్ 22న) పహల్గాంలో భద్రతా లోపాలు ఉన్నాయని స్వయంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అంగీకరించారని ఆయన గుర్తుచేశారు. ఆ ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన కొన్ని వివరాలను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్), డిప్యూటీ ఆర్మీ చీఫ్, మరో సీనియర్ ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించారని ఖర్గే చెప్పారు. ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను పట్టుకోవడంలో జాప్యం జరగడం, ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. మన సైన్యం ధైర్యంగా పోరాడుతోంది. కానీ, ఇటువంటి సంఘటనలు మన భద్రతా వ్యవస్థలోని లోపాలను బయటపెడుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
మరోవైపు విపక్షాల డిమాండ్‌పై రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర చర్చకు నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అలాంటి సైనిక ఆపరేషన్ ఎన్నడూ జరగలేదని పేర్కొంటూ పహల్గాం ఉగ్రదాడిపైనా చర్చిస్తామని తెలిపారు. ఇంతకుముందు పార్లమెంటు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలోనూ ఈ వివరాలను విపక్షాలకు తాము తెలిపామని నడ్డా చెప్పారు.
ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై సభ్యులు కోరుకున్నన్ని రోజులు పూర్తిస్థాయి చర్చ జరుగుతుందని విపక్ష ఎంపీలకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ కూడా హామీ ఇచ్చారు. దీనిపై తాను అన్ని పార్టీల నేతలతో మాట్లాడుతానని చెప్పారు. అయితే ఆలస్యం చేయకుండా ఆపరేషన్ సిందూర్‌పై వెంటనే చర్చను మొదలుపెట్టాలని ఖర్గే కోరారు. దీనిపై నడ్డా స్పందిస్తూ, తాము చర్చ నుంచి తప్పించుకునే యత్నం చేయడం లేదన్నారు.
ఈక్రమంలో రాజ్యసభ ఛైర్మన్ ధన్ఖర్ కలుగజేసుకుంటూ, అన్ని పార్టీల ఎంపీలు పరస్పర గౌరవ భావంతో మెలగాలని కోరారు. పరుష పదజాలాన్ని, వ్యక్తిగత దూషణలను ఏ వేదికపైనా చేయొద్దని సూచించారు. ఘర్షణలు, విమర్శలు అనేవి అర్ధవంతమైన రాజకీయాలు కానే కావని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ఒక్కరు కూడా భారత ప్రయోజనాలను వ్యతిరేకించరని ధన్ఖర్ పేర్కొన్నారు. భారత నాగరికతలోని విలువలకు వ్యతిరేకంగా ఉండే నడవడిని విడనాడాలని హితవు చెప్పారు.
పార్లమెంటు సమావేశాలు అర్ధవంతంగా జరగాలంటే, చర్చలు, సంప్రదింపులు మాత్రమే మార్గాలని జగదీప్ ధన్‌ఖఢ్ స్పష్టం చేశారు. భారతదేశ చారిత్రక బలం కూడా చర్చలు, సంప్రదింపులు, సంభాషణలపైనే ఆధారపడి ఉందన్నారు. ఆ బాటలోనే పార్లమెంటు చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు. అంతర్గత కుమ్ములాటల వల్ల మన శత్రువులకు బలం వస్తుందని, మనల్ని విభజించే సామర్థ్యం వాళ్లకు లభిస్తుందని హెచ్చరించారు.
మరోవంక, ఈ ఘటనపై చర్చించాలంటూ విపక్షాలు లోక్‌సభలో నిరసనకు దిగారు. దీంతో దిగువ సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో లోక్‌సభను వాయిదా వేయాల్సి వచ్చింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించాలంటూ పట్టుబట్టారు. అయితే, ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలపై చర్చ చేపడదామని స్పీకర్ ఓంబిర్లా నచ్చజెప్పారు. అయినా ఎంపీలు వినిపించుకోలేదు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత 2 గంటలకు, 4 గంటలకు వాయిదా వేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మంగళవారంకు వాయిదా వేశారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ తనను మాట్లాడనివ్వట్లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సమావేశాల్లో అధికార పక్షం పక్షపాతంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. రక్షణ మంత్రి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులకు మాట్లాడటానికి అనుమతి ఇచ్చారని.. తనకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.

More Stories
`బాబ్రీ మసీద్’కు భూమి పూజ నిప్పుతో చెలగాటం.. బిజెపి
లుధియానాలో అక్రమ బంగ్లాదేశీయులపై పోస్ట్ కు అరెస్ట్!
పాక్ అధికారులపై ఆంక్షలు.. అమెరికా కాంగ్రెస్ సభ్యుల వినతి