
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ సూచించారు. కర్నూలులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (త్రిపుల్‌ఐటి డిఎం) 7వ స్నాతకోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ వి.నారాయణన్ మాట్లాడుతూ మన దేశం 2047 నాటికి శాస్త్ర, సాంకేతిక రంగంలో మరిన్ని మార్పులు సాధించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
స్వాతంత్య్రం అనంతరం శాస్త్ర, సాంకేతిక రంగంలో అనేక విజయాలను సాధించామని వివరించారు. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని పేర్కొంటూ ఇప్పటికే దాదాపుగా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకున్నామని తెలిపారు. మన దేశం ఇప్పుడు ఆహార ధాన్యాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని గుర్తు చేశారు. వైద్య రంగంలో కూడా అనేక మార్పులు వచ్చాయని తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందని చెబుతూ శాస్త్ర, సాంకేతిక రంగంలో మార్పుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆలోచన చేయాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి పుట్టిన గడ్డకు సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని కోరారు. ఇలాంటి విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆలోచనలను పెంపొందించే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని చెప్పారు. ఈ విద్యా సంస్థ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు.
త్రిపుల్‌ఐటి డిఎం చైర్మన్ పద్మశ్రీ విజయలక్ష్మి దేశమనే మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థులకు నూతన ఆవిష్కరణ పద్ధతుల్లో బోధన చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో ఈ విద్యా సంస్థను పరిశోధనకు నిలయంగా మారుస్తామని చెప్పారు. స్నాతకోత్సవ సభకు త్రిపుల్ ఐటి డిఎం డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్.మూర్తి అధ్యక్ష వహించారు. స్నాతకోత్సవంలో మొత్తం 206 డిగ్రీ పట్టాలను ప్రధానం చేశారు. త్రిపుల్‌ఐటి డిఎం మాజీ డైరెక్టర్ డివిఎల్ సోమయాజులు, రిజిస్ట్రార్ గురుమూర్తి, బోర్డ్ మెంబర్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
More Stories
సుంకాలతో సగం రొయ్యల ఎగుమతులు.. రూ 25,000 కోట్ల నష్టం
రాజకీయాల్లో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం
యూరియా ఎక్కువ వాడితే కాన్సర్… వాడకం తగ్గిస్తే కట్టకు రూ. 800