కేరళ నర్సును రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం

కేరళ నర్సును రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం

యెమెన్ లో ఉరిశిక్ష పడిన కేరళ నర్సును రక్షించేందుకు భారత ప్రభుత్వం ‘సాధ్యమైనంత వరకు’ అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్రం ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.  ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన అటార్నీ జనరల్ వెంకట రమణి, “యెమెన్లోని పరిస్థితులను, చట్టాలను పరిగణనలోకి తీసుకుంటే, భారత ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ద్విసభ్య ధర్మాసనానికి ఆయన తెలియజేశారు.

“భారత ప్రభుత్వం కేరళ నర్సును రక్షించేందుకు ఎంత దూరం వెళ్లాలో అంత దూరం వెళ్లింది” అని ఆయన సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేశారు. “భారత్‌ – యెమెన్‌ల మధ్య దౌత్య సంబంధాలు లేవు. అందుకే ఉరిశిక్షను వాయిదా వేయడం లేదా నిలిపివేయడం సాధ్యమేనా? అని అక్కడి ప్రాసిక్యూటర్‌కు ఓ లేఖ రాశాం” అని తెలిపారు. 

“అంతేకాదు అక్కడ చాలా ప్రభావవంతమైన షేక్లతోనూ సంప్రదింపులు చేసింది. ఈ విధంగా మన దేశ పౌరురాలిని రక్షించేందుకు భారత ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అయితే యెమెన్‌ విషయంలోని సున్నితత్వాన్ని దృష్టిలోపెట్టుకొని, ఈ విషయంలో మన ప్రభుత్వం చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు. ఈ కేసుకు దౌత్యపరంగా ఎలాంటి గుర్తింపు లేదు” అని చెప్పారు. 

నిమిష ప్రియ (38)ను కాపాడేందుకు హత్యాపరిహార ధనం (బ్లడ్‌ మనీ) చెల్లించడం ఒక్కటే ఏకైక పరిష్కారమని ‘సేవ్‌ నిమిష ప్రియ-ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ కౌన్సిల్‌’ అనే సంస్థ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆమె తల్లి ప్రస్తుతం యెమెన్‌లోనే ఉన్నారని.. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఓ సామాజిక కార్యకర్త ద్వారా మాట్లాడుతున్నారని వెల్లడించింది. పరిహార ధనం తీసుకోవడానికి హతుడి కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే నిమిష బయటపడే అవకాశం ఉంటుందని తెలిపింది. 

అయితే బ్లడ్‌ మనీ చెల్లింపు ప్రైవేటుగా జరగాల్సిన వ్యవహారమని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి అన్నారు. ఆ డబ్బు తాము ఏర్పాటు చేసుకుంటామని నిమిష కుటుంబ సభ్యులు చెబుతున్నారని, అయితే ఎవరితో మాట్లాడాలన్నదే ఇక్కడ ప్రశ్న అని చెబుతూ బ్లడ్‌ మనీ కేవలం ప్రైవేటు సంప్రదింపులు మాత్రమే అని  వెంకట రమణి తెలియజేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ సందీప్‌ మెహతా స్పందిస్తూ, “ఇది చాలా ఆందోళనకరం. ఒకవేళ ఆమె (నిమిష) ప్రాణాలు కోల్పోతే, అది చాలా బాధాకరం” అని వ్యాఖ్యానించారు.