
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఏపీ రాజధాని అమరావతితోపాటు వివిధ జిల్లాలు, తీర ప్రాంత అభివృద్ధి కోసం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులతోపాటు ఉన్నతాధికారుల బృందం జులై 26 నుంచి 30 వరకూ సింగపూర్‌లో పర్యటించనుంది.
ఈ బృందంలో మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్‌తోపాటు ఉన్నతాధికారులు కాటంనేని భాస్కర్, ఎన్.యువరాజ్, కార్తీకేయ మిశ్రా, కన్నబాబు, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు నుంచి సాయికాంత్ వర్మ ఉన్నారు. సింగపూర్‌లోని రాజకీయ, వ్యాపార వర్గాలతో ఈ బృందం సమావేశం కానుంది. నగర ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పనతోపాటు భవిష్యత్ సాంకేతికతను అంది పుచ్చుకోవడం తదితర అంశాలపై చంద్రబాబు సారథ్యంలోని ఈ బృందం సింగపూర్‌లోని వివిధ రంగాల ప్రముఖలతో చర్చించనుంది.
ఈ పర్యటన వివరాలను తెలుపుతూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. దీంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. అదే సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాష్ట్ర రాజధానిగా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, వెలగపూడి తదితర 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసింది.
ఈ ప్రాంతానికి రాజధాని అమరావతిగా పేరు పెట్టారు. ఈ రాజధాని నిర్మాణం కోసం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నాటి సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు సైతం చేసుకున్నారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీని ప్రజలు గెలిపించారు. అయితే అంతకుముందు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ రాజధాని అమరావతికి మద్దతు ప్రకటించారు. కానీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మాట, దీంతో ఏపీకి మూడు రాజధానులంటూ అదే అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేశారు.
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరిన క్రమంలో ఇప్పుడు రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభమయ్యాయి. అలాంటి వేళ.. సీఎం చంద్రబాబు నాయుడు తన కేబినెట్ సహచరులతోపాటు ఉన్నతాధికార ప్రతినిధి బృందంతో సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముగించుకుని జులై 30న తిరిగి అమరావతికి రానున్నారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు