 
                సీనియర్ టిడిపి నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తరువులు జారీచేశారు. ఆయనతో పాటు హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్, గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తాలను రాష్ట్రపతి నియమించారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా కొనసాగుతున్న బండారు దత్తాత్రేయ స్థానంలో కొత్తవారిని నియమించారు.
తెలుగు దేశం పార్టీ నుండి గవర్నర్ పదవి చేపడుతున్న మొదటి నేతగా అశోక్ గజపతి రాజు నిలుస్తారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామి పక్షం కావడంతో, రాజ్యసభ ఎన్నికలలో ఏపీ నుండి ఉదారంగా బీజేపీకి రెండు స్థానాలు కేటాయించడంతో గవర్నర్ పదవి ఇవ్వాలని బిజెపి నిర్ణయించినట్లు తెలుస్తున్నది. కొద్దీ రోజులక్రితమే ఈ పదవికి టిడిపి నుండి ఓ పేరును సూచింపమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు చెబుతున్నారు.
వాస్తవానికి 2014-19  సమయంలోనే ఎన్డీయే భాగస్వామిగా ఉన్న టిడిపికి గవర్నర్ పదవి ఇచ్చేందుకు బిజెపి సుముఖత వ్యక్తం చేసిందని, అయితే చివరిలో అర్ధాంతరంగా టిడిపి ఎన్డీయే నుండి వైదొలగడంతో సాధ్యం కాలేదని తెలుస్తున్నది. ఈ పదవి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకున్నారు. వారు అశోక్ గజపతి రాజుతో పాటు యనమల రామకృష్ణుడు.
ఇద్దరూ టిడిపి ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉన్నవారే కావడమే కాకుండా, మొదటి నుండి చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ రాష్ట్ర శాసనసభ స్పీకర్ లుగా, ఆర్ధిక మంత్రులుగా పనిచేశారు. గత ఎన్నికలలో వీరిద్దరూ పోటీచేయకుండా, వారి కుమార్తెలను పోటీకి దింపడంతో వారు ఎంపీలుగా గెలుపొందారు. పైగా, యనమల రామకృష్ణుడు వియ్యనుకు ఎమ్యెల్యేగా, అల్లుడు ఎంపీగా ఎన్నికయ్యారు.
ఈ మధ్యనే శాసన మండలి సభ్యత్వం ముగిసిన రామకృష్ణుడు తనకు అవకాశం ఇస్తే రాజ్యసభకు వీడతానని లేదా ఇక రాజకీయాల నుండి నిష్క్రమిస్తానని ప్రకటించారు. దానితో అశోక్ గజపతిరాజును ఎంపిక చేసిన్నట్లు కనిపిస్తున్నది. పైగా, 2014 నుండి 2018 వరకు కేంద్ర మంత్రివర్గంలో పనిచేయడంతో కేంద్ర బిజెపి నాయకులతో సానుకూల సంబంధాలు ఆయనకు ఉన్నాయి.
నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గత 11 ఏళ్ళల్లో తెలుగు రాష్ట్రాల నుండి సిహెచ్ విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, ఎన్ ఇంద్రసేనారెడ్డిలు గవర్నర్ లుగా నీయమితులయ్యారు.





More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
మొంథా తుపాను ప్రాథమిక నష్టం రూ.5265 కోట్లు