దుర్గమ్మకు ఆషాడం సారెతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్త జనం

దుర్గమ్మకు ఆషాడం సారెతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్త జనం

తెలుగింటి వారి ఆడపడుచుగా ఆరాధించే కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాడ సారె సమర్పించేందుకు వస్తున్న భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి మొత్తం కిక్కిరిసింది. వారాంతపు సెలవులు, ఆషాడసారె సమర్పణ కోసం వేలాదిగా భక్తులు అమ్మవారి ఆలయానికి తరలిరావడంతో క్యూ లైన్ లన్నీ కిక్కిరిశాయి.

 మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుండి గడిచిన రెండు రోజులుగా భక్తుల రాక అంతకంతకు పెరుగుతూ వస్తోంది. బృందాలుగా అమ్మకు సారె సమర్పించేందుకు తరలివస్తున్న ఉత్తరాంధ్ర భక్తులు గణనీయంగా పెరుగుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం నాటికి సుమారు 40 వేలకు కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 

భక్తుల రద్దీ గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో అంతరాలయ, విఐపి బ్రేక్ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. అలాగే రూ 100, 300, 500 టికెట్ల జారీని నిలుపుదల చేసిన అధికారులు సామాన్య భక్తులందరికీ శీఘ్ర దర్శనం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకున్నారు. అన్ని క్యూ లైన్ లోకి భక్తులను అనుపదిస్తు, బంగారు వాకిలి నుండే అమ్మవారి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు.

ఆషాడ సారె సమర్పించేందుకు వస్తున్న భక్తులు అమ్మవారి దర్శనానంతరం, ఆలయ ప్రాంగణంలోని మహా మండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సారె ను సమర్పిస్తున్నారు.

తెల్లవారుజామునుండే భక్తుల రాక గంటకు పెరుగుతున్న పరిస్థితులలో క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. భక్తుల రాకను ముందుగానే అంచనా వేసిన అధికారులు, సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆదివారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులకు వాటర్ బాటిల్స్ లను ప్రత్యేకంగా అందించే ఏర్పాట్లు చేశారు. 

ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు భక్తులు తిరుగుతున్న ప్రాంతాలలో ప్రత్యేక కార్పెట్లు వేయడంతో పాటు, చల్లటి నీటిని చెల్లి, కాళ్లు కాలకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో క్యూలైన్లో ఉన్న భక్తులకు ప్రత్యేకంగా బిస్కెట్ ప్యాకెట్లను అందజేస్తున్నారు. 

భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం లోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది అందరూ సమన్వయంతో అన్ని ప్రాంతాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. క్షణక్షణం పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్న ఈవో శినా నాయక్ అప్పటికప్పుడు అధికారులకు అవసరమైన సూచనలు సలహాలు ఆదేశాలు జారీ చేస్తున్నారు.