
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి తిరుమలలో టీటీడీ, దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీలో ఉన్న అపరిష్కృత సమస్యలతో పాటు పలు అంశాలపై చర్చలు జరిపారు.
గతంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఆలయాలకు చెందిన కొన్ని సమస్యలు వచ్చాయని ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆయా సమస్యలపై చర్చించి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఇవాళ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. 9 శాతం కామన్‌గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకోవాలని నిబంధనలు ఉన్నట్లు వివరించారు. గతంలో 5 శాతం ఉన్న దాన్ని 9 శాతానికి పెంచామని వెల్లడించారు.
నిరుద్యోగులుగా ఉన్న అర్చకులకు భృతి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినట్లు ఆనం గుర్తుచేశారు. ఈ మేరకు రాష్ట్రంలో 590 మంది వేదపండితులు నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పారు. వారికి రూ.3000లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా టీటీడీ కాలేజ్, పాఠశాలల్లో 192 పోస్టుల భర్తీపై చర్చించినట్లు వివరించారు. మరోవైపు శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని పునర్నిర్మాణంలో ఉన్న ఆలయాలకు రూ.147 కోట్లు విడుదల కాకుండా నిలిచిపోయాయన్నారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా మరో రూ.11 కోట్ల నిధులు మిగతా ఆలయాలకు రావాల్సి ఉందని తెలిపారు. వీటన్నింటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు, అధికారులు చెప్పారని మంత్రి వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులపై నిర్ణయం తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చెప్పిందని పేర్కొన్నారు. దుర్గగుడికి మరో రోడ్డు వేసేందుకు టీటీడీ సహకారం కావాలని ఆనం కోరారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు