
ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌తో సమీకృతం చేసిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఆయుష్ చికిత్సా పద్ధతుల వివరాలను కూడా ఏఐతో భారత్ సమీకృతం చేసిందని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే తాము ‘మ్యాపింగ్ ది అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్’ శీర్షికన సంప్రదాయ వైద్య విధానాలపై ఏఐ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించామని వెల్లడించింది. ఆయుర్వేద, సిద్ధ, యునాని, సోవా రిగ్పా, హోమియోపతి వంటి ప్రాచీన వైద్య విధానాలను ‘ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ’ (టికెడిఏ) ద్వారా డిజిటల్ రూపంలోకి తెచ్చిన తొలి దేశం భారతేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది.
ఇందులోని విలువైన ప్రాచీన సమాచారాన్ని ప్రతీ వైద్య నిపుణుడు అర్ధవంతంగా తెలుసుకునేందుకు ప్రత్యేక ఏఐ టూల్స్ ఉన్నాయని తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ చేసిన ప్రకటనను భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ స్వాగతించింది. డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలతో పాటు ప్రాచీన వైద్య విధానాల సమాచారాన్ని భావితరాలకు చేర్చే విషయంలో ప్రపంచంలో అగ్రగామిగా భారత్ నిలవాలనే నరేంద్ర మోదీ సర్కారు సంకల్పానికి ఈ పురోగతి నిదర్శనమని ఓ ప్రకటనలో తెలిపింది.
సంప్రదాయ ఔషధాల వినియోగ సమాచారాన్ని ఏఐతో సమీకృతం చేయాలనే డబ్ల్యూహెచ్‌ఓ కార్యాచరణ ప్రణాళికకు భారత్ మార్గదర్శిగా నిలిచిందని పేర్కొంది. ప్రాచీన వైద్య పద్ధతులను ప్రోత్సహించేందుకు ఒక శాస్త్రీయమైన వ్యవస్థను అందుబాటులోకి తేవాలనే బలమైన సంకల్పంతో కేంద్ర సర్కారు ముందుకు సాగుతుందని ఆయుష్ శాఖ వెల్లడించింది.
భారత్ తీసుకొచ్చిన ‘ఆయుర్ జీనోమిక్స్’ కాన్సెప్ట్‌ను డబ్ల్యూహెచ్‌ఓ కొనియాడింది. ఆయుర్వేద సిద్ధాంతాలతో జీనోమిక్స్‌ను మిళితం చేయడం గొప్ప విషయమని పేర్కొంది. జీనోమిక్స్ అనేది జీవరాశుల డీఎన్‌ఏలు, జన్యువుల గురించి అధ్యయనం చేస్తుంది. ఏయే వ్యాధులు ఎందుకు వస్తాయి? ఎలాంటి ఆరోగ్య సమస్యలకు ఏవిధమైన పరిష్కారాలు ఉంటాయి? అనే ప్రశ్నలకు ఆయుర్వేదం ప్రకారం సమాధానాలను అందించే ఏఐ సాఫ్ట్వేర్లను భారత్ అందుబాటులోకి తెచ్చింది.
ఆయుర్వేద, సిద్ధ, యునాని, సోవా రిగ్పా, హోమియోపతి వంటి చికిత్సా పద్ధతులపై ఏఐ సాఫ్ట్వేర్లను భారత్ అందుబాటులోకి తెచ్చింది. ఈ చికిత్సలు అందించే క్రమంలో రోగి నాడిని పరిశీలించడం, నాలుకను పరీక్షించడం వంటి రోగ నిర్ధరణ పద్ధతులను ఎలా అనుసరించాలనే సమాచారం ఆయా సాఫ్ట్‌వేర్లలో ఉంది. ఆయుర్వేద మూలికా ఔషధాలు రోగి శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? రోగి జన్యువులపై వాటి ప్రభావం ఎంత? ప్రస్తుత వ్యాధులకు ఆయుర్వేద ఔషధాలతో ఎంతమేర చికిత్స చేయొచ్చు? అనే వివరాలను ఏఐలో భారత్ పొందుపరచింది.
More Stories
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్