అమరావతిలో మరోసారి భూసేకరణపై మంత్రులే వ్యతిరేకం!

అమరావతిలో మరోసారి భూసేకరణపై మంత్రులే వ్యతిరేకం!
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన రెండో విడత భూ సమీకరణ పట్ల ఆయన మంత్రివర్గంలోని తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. గతంలో సేకరించిన 36 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా మళ్లీ రెండో విడత భూ సమీకరణ పేరుతో జనాల్లోకి వెళ్తున్న అధికార పార్టీ నేతలపై ఒకవంక పలు గ్రామాలలో రైతుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 
 
దీంతో ఏకంగా తాజాగా జరిగిన మంత్రులు భేటీలోనే మంత్రులు ఈ భూసేకరణ వద్దంటూ సీఎం చంద్రబాబుకు తేల్చిచెప్పేశారని తెలుస్తున్నది. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన మంత్రుల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇది వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి తిరిగి ప్రభుత్వంకు వ్యతిరేకంగా జనంలోకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన్నట్లే కాగలదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 
 
కాంగ్రెస్ నే ఎదుర్కున్నాం, వైసీపీ ఎంత? అంటూ ఆయనను వారించే ప్రయత్నం చంద్రబాబు చేసినా ప్రయోజనం లేకపోయింది. “మీరు చాలా మాట్లాడతారు, జగన్ ను ఎదుర్కోవడానికి ఇప్పటివరకు ఏం చేశారు?” అంటూ పవన్ నిలదీసేసరికి ముఖ్యమంత్రి మాట్లాడలేక పోయారని చెబుతున్నారు.

మరోవంక, అమరావతి వ్యవహారంలో మునిసిపల్ మంత్రి డా. నారాయణ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. అమరావతి విషయంలో నారాయణ బ్యూరోక్రాట్ లా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారని సమాచారం. రెండో విడత పూలింగ్ చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబుకు మెజార్టీ మంత్రులు చెప్పేసినట్లు తెలుస్తోంది. పూలింగ్ విరమించుకోవాలని వారు సీఎంకు సూచించారు.

రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం రెండో విడతలో దాదాపు 40 వేల ఎకరాలకు పైగా భూమిని అమరావతి గ్రామాల్లో సమీకరించేందుకు సిద్దమైంది. అయితే అభ్యంతరాల నేపథ్యంలో ఈ 40 వేల ఎకరాలు కాస్తా 30 వేలు, ఆ తర్వాత 25 వేలకు కుదించారు. అయితే ఇప్పుడు మొత్తంగా భూసమీకరణే వద్దంటూ రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ముందుగా భూములిచ్చిన రైతులు తమకు న్యాయం చేసి రెండో విడతకు వెళ్లాలని కోరుతుండగా, రెండో విడత భూములిచ్చిన వారు సైతం అప్పట్లో భూములిచ్చిన వారికే న్యాయం చేయలేదు, మాకెప్పుడు న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలోనూ వాడీవేడీ చర్చకు దారితీసింది. పదేళ్లు పనులేవీ జరగకపోవడంతో ల్యాండ్ పూలింగ్ పై అమరావతిలో ఆందోళన వ్యక్తమవుతోందని మంత్రులు సీఎంకు తెలిపారు.
సీఎం చంద్రబాబు, నారాయణ మినహా మంత్రులు ఈ భూసమీకరణకు అభ్యంతరాలు చెప్పినట్లు సమాచారం. రెండో విడత పూలింగ్ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పడుతున్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.  పైగా, ప్రభుత్వం రెండో విడత భూసేకరణ ప్రకటించగానే అమరావతిలోని కాకుండా ఆ పరిసర ప్రాంతాలలో భూమి ధరలు గణనీయంగా పడిపోవడంతో ప్రజల నుండి తీవ్ర అసంతృప్తి సహితం వ్యక్తం అవుతుంది.