భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను కచ్చితంగా ధ్వంసం చేసిందని, వాటిలో ఏదీ మిస్ కాలేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ సిందూర్ పట్ల తనకు గర్వంగా ఉందని ఐఐటి మద్రాస్ 62వ స్నాతకోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలిపారు. అలాగే ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ చేసిన దాడుల్లో భారత్‌కు నష్టం కలిగిందని విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భారతదేశ వ్యూహాత్మక ఆపరేషన్ విశ్వసనీయతను ప్రశ్నించే వారు భారత్ వైపు నష్టం జరిగిందని చెప్పే ఒక్క ఫోటోనైనా చూపించాలని అజిత్ డోభాల్సవాలు చేశారు.
“ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ అది చేసింది, ఇది చేసిందంటూ విదేశీ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేసింది. దేశంలో ఉగ్రస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే అత్యంత కచ్చితమైన సమాచారంతోనే భారత్ సైన్యం దాడులు చేసింది. పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్ గురించి నిజంగా గర్వపడుతున్నా. స్వదేశీ సామర్థ్యంతోనే పాకిస్థాన్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం” అని తెలిపారు.
“మొత్తం ఆపరేషన్ 23 నిమిషాల్లోనే ముగిసింది. మే 7న తెల్లవారుజామున ఒంటి గంట తర్వాత ఇదంతా జరిగింది. ఆ తర్వాత, పాకిస్థాన్ అది చేసింది, ఇది చేసిందని విదేశీ మీడియాలో అసత్య కథనాలు వచ్చాయి. అయితే, భారత్‌కు నష్టం కలిగిందనే ఒక్క చిత్రమైన ఆధారంగా చూపించగలరా? పాకిస్థాన్‌లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయి. భారత్‌కు చెందిన స్థావరాలపై భారత్ సైన్యం చిన్న గీత కూడా పడనివ్వలేదు” అని వివరించారు.
భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను, యుద్ధాలను ఎదుర్కోవడానికి ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైనవన్నీ దేశీయంగానే రూపొందించుకుంటున్నామని అజిత్ డోభాల్ చెప్పారు. “ఆపరేషన్ సిందూర్ సమయంలో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్ భూభాగాల లోపలి వరకూ వెళ్లి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయి. పాకిస్థాన్ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400తో మధ్యలోనే సమర్థమంతంగా పేల్చివేశాయి” అని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ మీడియా నెగిటివ్ కవరేజ్‌ను ప్రస్తావిస్తూ, ‘ది న్యూయార్క్ టైమ్’ వంటి ప్రముఖ పబ్లికేషన్లు ఈ ఘటనపై విస్తృతమైన కథనాలు రాశాయని, అయితే శాటిలైట్ ఇమేజ్‌లు ఇందుకు భిన్నమైన వాస్తవాలను వెల్లడి చేశాయని పేర్కొన్నారు. మే 10వ తేదీకి ముందు, ఆ తరువాత పాకిస్థాన్‌లోని 13 ఎయిర్ బేస్‌లకు ఒక్క గీత కూడా పడలేదని శాటిలైట్ ఇమేజ్‌లు చూపించాయని, అది నిజమని దోభాల్ స్పష్టం చేశారు.
ఈ ఆపరేషన్‌లో స్వదేశీ రక్షణ సాంకేతికతను ఉపయోగించించామని, డిఫెన్స్ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తికి దేశం కట్టుబడి ఉండటాన్ని ఇది చాటిచెప్పిందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన సాధనాసంపత్తిని దేశీయంగానే భారత్ రూపొందిస్తోందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ మన దేశ అడ్వాన్స్‌డ్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని, సర్జికల్ కచ్చితత్వాన్ని నిరూపించిందని తెలిపారు.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం