ఈ-కామర్స్, ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా ఉగ్ర నిధులు

ఈ-కామర్స్, ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా ఉగ్ర నిధులు
 
* ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వెల్లడి
 
2019 పుల్వామా ఉగ్రవాద దాడి, 2022 గోరఖ్‌నాథ్ ఆలయ సంఘటన వంటి భారతదేశ ఉదాహరణలను ఉటంకిస్తూ, ఉగ్రవాద నిధుల కోసం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఆన్‌లైన్ చెల్లింపు సేవలు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్) వెల్లడించింది.  గ్లోబల్ యాంటీ-టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్‌డాగ్ ‘టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్‌లపై సమగ్ర నవీకరణ’ అనే తన తాజా నివేదికలో ఈ పరిశీలనలను వివరించింది. 
 
ఎఫ్ఏటిఎఫ్  ప్రకారం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఉగ్రవాదులకు నిధులను సమీకరించడానికి, గుర్తింపును తప్పించుకోవడానికి, ప్రాణాంతక కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఒక సాధనంగా కూడా మారుతున్నాయి. పుల్వామా దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారని పేరొంటు ఇది దేశాన్ని, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషాదం అని, అటువంటి దాడులకు నిధులు సమకూర్చడానికి ఆన్‌లైన్ ఛానెల్‌లను ఉపయోగించడం మరింత ఆందోళన కలిగిస్తున్నదని తెలిపింది.
 
“ఉగ్ర నిధుల కోసం ప్రభుత్వ స్పాన్సర్‌షిప్‌ను నిధుల సేకరణ సాంకేతికతగా లేదా ఉగ్రవాద చర్యలలో నిమగ్నమైన కొన్ని సంస్థల ఆర్థిక నిర్వహణ వ్యూహంలో భాగంగా ఉపయోగించడాన్ని ప్రతినిధులు ప్రస్తావించారు. ప్రత్యక్ష ఆర్థిక సహాయం, లాజిస్టికల్, మెటీరియల్ మద్దతు లేదా శిక్షణ అందించడం వంటి అనేక రకాల మద్దతు వెల్లడైంది” అని ఎఫ్ఏటిఎఫ్ తెలిపింది. 
 
పరిశీలనలో పుల్వామా, పహల్గామ్ కేసులు
 
ఏప్రిల్ 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని జూన్ లో ఎఫ్ఏటిఎఫ్ ఖండిస్తూ, ఆర్థిక సహాయం లేకుండా అలాంటి దాడులు సాధ్యం కాదని స్పష్టం చేసింది. 200 అధికార పరిధి కలిగిన ప్రాంతాలకు వ్యాపించిన తన అంతర్జాతీయ నెట్‌వర్క్ అందించిన కేసులను సంకలనం చేస్తూ, “టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ సమగ్ర విశ్లేషణ”ను త్వరలో విడుదల చేస్తామని చెప్పింది.
 
భారతదేశంలో ఉగ్రవాద దాడికి సంబంధించిన పదార్థాల సేకరణ కోసం ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం గురించి కేస్ స్టడీని ప్రస్తావిస్తూ, దాడిలో ఉపయోగించిన అధునాతన పేలుడు పరికరం కీలకమైన భాగం అల్యూమినియం పౌడర్ ను ఈపిఓఎమ్ అమెజాన్ ద్వారా సేకరించిన్నట్లు  ఎఫ్ఏటిఎఫ్ తెలిపింది. పేలుడు ప్రభావాన్ని పెంచడానికి ఈ పదార్థంను ఉపయోగించారు. 
 
పుల్వామా దాడి దర్యాప్తు , ఫలితాలు 
 
ఫిబ్రవరి 2019లో, జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో భారత భద్రతా దళాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సైనికులు మరణించారు. ఈ దాడిని జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) నిర్వహించిందని భారత అధికారులు నిర్ధారించారు. దర్యాప్తు ఫలితంగా, 19 మంది వ్యక్తులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సంబంధిత నిబంధనల కింద అభియోగాలు మోపారు, వాటిలో ఉగ్రనిధులకు సంబంధించిన విభాగాలు కూడా ఉన్నాయి.
 
అభియోగాలు మోపబడిన వారిలో ఆత్మాహుతి బాంబర్‌తో సహా ఏడుగురు విదేశీ పౌరులు ఉన్నారు. దాడికి సంబంధించిన వాహనాలు, ఉగ్రవాద స్థావరాలు వంటి చరాస్తులు, స్థిర ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 
 
పాకిస్తాన్ పాత్రను ఎత్తి చూపిన భారత్
 
 పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిరంతరం మద్దతు ఇవ్వడం, ఆయుధ సేకరణ కోసం బహుపాక్షిక నిధులను సమకూర్చడాన్ని భారత అధికారులు పదేపదే ప్రస్తావిస్తున్నారు.  పాకిస్తాన్ నియమించబడిన ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామం ఇచ్చిందని భారతదేశం స్థిరంగా పేర్కొంది.  మూలాల ప్రకారం, పాకిస్తాన్ అటువంటి చర్య ఆ దేశాన్ని   ఎఫ్ఏటిఎఫ్ “గ్రే (బూడిద) జాబితాలో” ఉంచాల్సిన అవసరం ఉందని భారతదేశం అభిప్రాయపడింది. 
ఎఫ్ఏటిఎఫ్   నివేదిక ఉగ్రవాదులు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఆన్‌లైన్ మార్కెట్‌ ప్లేస్‌లను దుర్వినియోగం చేస్తున్నారని, ఉగ్రవాదులు తమ కార్యాచరణ సేకరణ (పరికరాలు, ఆయుధాలు, రసాయనాలు, 3డి-ప్రింటింగ్ మెటీరియల్) కోసం ఈ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించారని పేర్కొంది. వీటిని ఉగ్రవాదులు తమ ప్రాజెక్టులు, కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడానికి, వస్తువులను విక్రయించడానికి కూడా ఉపయోగించవచ్చు. 
 
గతంలో డిమాండ్ లేని తక్కువ విలువ కలిగిన వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి. ఉగ్ర నిధుల ప్రమాదాలపై  ఎఫ్ఏటిఎఫ్ తన తాజా నివేదికలో ఉగ్రవాద నిధుల ప్రయోజనాల కోసం నిధులు, ఇతర ఆస్తులను సేకరించడం, తరలించడం, నిర్వహించడం కోసం ఉపయోగించే పద్ధతులను కూడా ప్రస్తావించింది. చెల్లింపు సేవల ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి ఆన్‌లైన్ నిధుల బదిలీలు వైర్-ట్రాన్స్‌ఫర్‌తో పోలిస్తే తక్కువ ట్రేసబిలిటీ, పారదర్శకతను అందిస్తాయని, దీనివల్ల బదిలీల ప్రారంభకులు, గ్రహీతలను స్పష్టంగా గుర్తించడం కష్టమవుతుందని పేర్కొంది.
 
ఉగ్రవాద చర్యకు నిధులు సమకూర్చడానికి ఆన్‌లైన్ చెల్లింపు సేవ, విపిఎన్ లను ఉపయోగించడంపై కేస్ స్టడీని ఇస్తూ,   ఎఫ్ఏటిఎఫ్ ఏప్రిల్ 3, 2022న జరిగిన గోరఖ్‌నాథ్ ఆలయం ఉల్లంఘనకు ప్రయత్నించిన సంఘటనను ఉదహరించింది. దీనిలో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్, లెవాంట్ (ఐఎస్ఐఎల్) భావజాలంతో ప్రభావితమైన ఒక వ్యక్తి భద్రతా సిబ్బందిపై దాడి చేయగా, వెంటనే అరెస్టు చేశారు. 
 
 ఆర్థిక దర్యాప్తులో ఆ వ్యక్తి ఐఎస్ఐఎల్ కి మద్దతుగా పేపాల్ ద్వారా రూ.69,841 (7,685 అమెరికా డాలర్లు) ను విదేశాలకు బదిలీ చేశాడని, అంతర్జాతీయ మూడవ పక్ష లావాదేవీలను ఉపయోగించి, ఐపి చిరునామాను అస్పష్టం చేయడానికి విపిఎం సేవలను ఉపయోగించాడని తేలింది. అతను విదేశీ మూలం నుండి రూ.10,323. 35 (188 డాలర్లు) కూడా అందుకున్నాడు.
 
మరింత లోతుగా ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తే నిందితుడు తన బ్యాంకు ఖాతా ద్వారా విపిఎం  ప్రొవైడర్‌కు ఈ సేవలను పొందేందుకు చెల్లింపు చేసినట్లు తేలింది. ఇమెయిల్ ద్వారా పొందిన నిందితుడి పేపాల్ లావాదేవీల సమగ్ర విశ్లేషణలో, విదేశీ ఖాతాలకు మొత్తం రూ. 669,841 (సుమారు 7,736 డాలర్లు) విలువైన 44 అంతర్జాతీయ మూడవ పక్ష లావాదేవీలు జరిగాయని తేలింది.
 
పైగా, నిందితుడు పేపాల్ ద్వారా విదేశీ ఖాతా నుండి నిధులు అందుకున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి నిందితుడు విదేశీ అధికార పరిధిలోని ఐఎస్ఐఎల్ అనుచరులుగా గుర్తించిన బహుళ వ్యక్తులకు డబ్బు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఇక్కడ పేర్కొనాలి.