పాక్, చైనా, బంగ్లాదేశ్ కలయికతో భారత భద్రతకు ముప్పు

పాక్, చైనా, బంగ్లాదేశ్ కలయికతో భారత భద్రతకు ముప్పు
చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల కలయిక భారత్ సుస్థిరత, భద్రతకు తీవ్ర సవాళ్లను సృష్టించగలదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని పలు దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అదునుగా చేసుకొని, వాటిపై విదేశీ శక్తులు పట్టును పెంచుకునే ముప్పు ఉందని హెచ్చరించారు. దీనివల్ల కూడా భారత్‌‌కు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు.

‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ గత ఐదేళ్లలో పాక్ కొనుగోలు చేసిన ఆయుధాల్లో దాదాపు 70 నుంచి 80 శాతం చైనావేనని ఆయన గుర్తు చేశారు. చైనా ఆయుధ తయారీ కంపెనీలతో పాకిస్థాన్ పెద్దఎత్తున ఒప్పందాలను కుదుర్చుకుందని అనిల్ చౌహాన్ తెలిపారు. ఆయా కంపెనీల ఆయుధ తయారీ యూనిట్లు, నిపుణులు పాక్‌ గడ్డపై కూడా కార్యకలాపాలు సాగిస్తుండొచ్చని అంచనా వేశారు.

అణ్వస్త్ర దేశాలైన భారత్- పాక్‌లు మే 7 – 10 మధ్య తొలిసారిగా నేరుగా సైనిక శక్తులతో తలపడ్డాయని చెబుతూ నాలుగు రోజుల ‘ఆపరేషన్ సిందూర్’ వేళ చైనా సరిహద్దుల్లో ఎలాంటి అసాధారణ సైనిక చర్యలూ చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. చైనా- పాక్ మధ్య వ్యూహాత్మక స్నేహం ఉందని,’ఆపరేషన్ సిందూర్’ చాలా తక్కువ రోజులే కొనసాగడంతో చైనా వైపు నుంచి స్పందన రాలేదని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు.

అయినప్పటికీ ఆ రెండు దేశాల స్నేహాన్ని తప్పకుండా భారత్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పాక్ అణ్వాయుధ బ్లాక్‌ మెయిలింగ్‌కు భయపడకుండా ‘ఆపరేషన్ సిందూర్‌’ను భారత్ నిర్వహించిందని చెప్పారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య సైనిక ఘర్షణకు ఆపరేషన్ సిందూరే ఏకైక ఉదాహరణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 

భారత్ చేపట్టిన ఈ సైనిక చర్య చాలా ప్రత్యేకమైందని, దాని నుంచి ఆసియా దేశాలతో పాటు యావత్ ప్రపంచం పాఠాలను నేర్చుకోవచ్చని ఆయన సూచించారు. “రాబోయే కాలంలోనూ సంప్రదాయక సైనిక ఘర్షణలే జరిగే అవకాశం ఉంది. అణ్వాయుధాల వినియోగం దాకా పరిస్థితులు తీవ్రతరం కావు. ఇందుకు మూడు ప్రాథమిక కారణాలు ఉన్నాయి” అని తెలిపారు. 

“మొదటి కారణం ఏమిటంటే అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదనే భారత్ పాలసీ. అందుకే ఏ పరిస్థితుల్లోనైనా పాక్ కూడా భారత్‌తో సాధారణ తరహా (సంప్రదాయక) సైనిక ఘర్షణకే దిగుతుంది. రెండోకారణం ఏమిటంటే ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా పాక్ సంప్రదాయక సైనిక ఘర్షణనే మొదలు పెట్టింది” అని చెప్పారు.

“మూడో కారణం ఏమిటంటే భారత్‌తో జరిగే సైనిక ఘర్షణలను ఏ స్థాయికి తీసుకెళ్లాలనేది పాక్ ఇష్టం. పాక్ స్పందించే రేంజ్​ కంటే పెద్ద రేంజ్​లోనే భారత్ బలమైన సమాధానం ఇవ్వగలదు. ఈవిషయం పాక్‌కు బాగా తెలుసు. అందుకే అది సంప్రదాయక ఘర్షణకే పరిమితం అవుతుంది” అని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వివరించారు. సంప్రదాయక సైనిక ఘర్షణను పతాక స్థాయికి తీసుకెళ్లే సత్తా భారత్‌కు ఉందని చెబుతూ సైబర్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ మార్గాల్లోనూ దాడులు జరిపే సత్తా మన దేశానికి ఉందని పేర్కొన్నారు. శత్రువులు ఈ తరహా దాడులు చేసినా ధీటుగా ఎదుర్కోగలమని ఆయన స్పష్టం చేశారు. 

అయితే బాలిస్టిక్, హైపర్ సోనిక్, క్రూయిజ్ రకాల క్షిపణులు, పెద్దసంఖ్యలో డ్రోన్లు, దిశను మార్చుకుంటూ ప్రయాణించే మిస్సైళ్లు, డ్రోన్ల నుంచి పూర్తిస్థాయి రక్షణను కల్పించే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఇంకా ప్రపంచంలో ఎక్కడా అందుబాటులోకి రాలేదని తెలిపారు.  రాబోయే కాలంలో ఈ తరహా సవాళ్లను ఎదుర్కొనేలా భారత్ సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని అనిల్ చౌహాన్ సూచించారు. ఏ క్షణమైనా శత్రుదేశాల దాడులను తిప్పికొట్టగల సైనిక సంసిద్ధత, 365 రోజుల్లో 24/7 అలర్ట్‌గా ఉండే వైఖరి అవసరమని చెప్పారు.