
రష్యా మాజీ రవాణా మంత్రి రోమన్ స్టారోవైట్ (53) సోమవారం తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనను పదవి నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే ఇలా జరగడం గమనార్హం. స్టారోవైట్ మాస్కో శివారులో తనను తాను కాల్చుకున్నట్లు రష్యన్ వార్తా సంస్థలు చెబుతున్నాయి.
స్టారోవైట్ మృతదేహం ఆయన కారులోనే లభించిందని ఆ దేశ దర్యాప్తు కమిటీ తెలిపింది. రష్యా అధికారిక సమాచార పోర్టల్ ప్రకారం, అధ్యక్షుడు పుతిన్ ఓ డిక్రీ ద్వారా రవాణా మంత్రిగా ఉన్న రోమన్ స్టారోవైట్ను పదవి నుంచి తొలగించారు. కానీ అందుకు గల కారణాలు వెల్లడించలేదు. వాస్తవానికి రోమన్ స్టారోవైట్ ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉండే కుర్స్క్ ప్రాంతానికి దాదాపు 5 ఏళ్లపాటు గవర్నర్గా పనిచేశారు.
తరువాత ఆయన 2024 మేలో రష్యా రవాణా మంత్రిగా నియమితులయ్యారు. కానీ ఆయనను పుతిన్ అర్ధాంతరంగా పదవి నుంచి తొలగించి, నోవ్గోరోడ్ ప్రాంత మాజీ గవర్నర్ ఆండ్రీ నికితిన్ను తాత్కాలిక రవాణా మంత్రిగా నియమించారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ అధికారికంగా వెల్లడించింది.
స్టారోవైట్ను తొలగించి నికితిన్ను రవాణా మంత్రిగా నియమించడానికి గల కారణం ఏమిటనే ప్రశ్నకు, క్రెమ్లిన్ ప్రతినిథి దిమిత్రి పెస్కోవ్, “అధ్యక్షుని అభిప్రాయం ప్రకారం, ఆండ్రీ నికితిన్కు వృత్తిపరమైన లక్షణాలతో పాటు చాలా అనుభవం ఉంది. ఇవి ఆయనకు అప్పగించిన పనులు సక్రమంగా నిర్వర్తించడానికి దోహదపడతాయి. అందుకే ఆయనకు రవాణా మంత్రి బాధ్యతలు అప్పగించారు” అని చెప్పారు.
స్టారోవైట్ను తొలగించి నికితిన్ను నియమించాలనే ప్రణాళిక గత నెలలో సెయింట్పీటర్స్బర్గ్లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్)కు ముందు నుంచే ఉందని ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రష్యా వైమానయాన, షిప్పింగ్ రంగాలకు గత కొంతకాలంగా అనేక అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోమన్ స్టారోవైట్ను తొలగించినట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఇంతకు ముందు రష్యా విమానాలపై భారీ ఎత్తున డ్రోన్ దాడులు చేస్తామని ఉక్రెయిన్ బెదిరించింది. దీనిలో జులై 5-6 తేదీల్లో రష్యన్ విమానాశ్రయాల్లో దాదాపు 300 విమానాలు నిలిచిపోయాయి. ఈ గందరగోళానికి తోడు లెనిన్గ్రాడ్ ఒపబ్లాస్ట్లోని ఉస్ట్-లుగా ఓడరేవు వద్ద ఓ ట్యాంకర్లో పేలుడు సంభవించింది. దీని కారణంగా భారీ స్థాయిలో అమ్మోనియా లీక్ అయ్యింది. ఇవన్నీ స్టారోవైట్ పదవికి ఎసరుపెట్టాయి. దీనికి తోడు ఆయనపై కొన్ని నెలలుగా అవినీతి కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?