నెలాఖరులో కాళేశ్వరంపై పిసి ఘోష్ నివేదిక

నెలాఖరులో కాళేశ్వరంపై పిసి ఘోష్ నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక  దాదాపు సిద్దం అయినట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి కమిషన్ తన నివేదికను అందజేయనున్నట్లు అధికారవర్గాల సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై సాంకేతిక తప్పిదాలు, నాణ్యతాలోపాలు, అవినీతిపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో జస్టిస్ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. 

ఈ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత సుదీర్ఘకాలంపాటు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయితే ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థలతో పాటు అప్పటి ప్రభుత్వంలో నిర్ణయాలకు బాధ్యులైన వారిని మొత్తంగా ఇప్పటి వరకు 115 మందిని విచారించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలు, డిజైన్, నాణ్యత ప్రమాణాలు, ఆర్థిక అంశాలు వంటి వాటిపై కమిషన్ లోతుగా అధ్యయనం చేసింది. ఆతర్వాత సంబంధిత నిపుణులు, ప్రభుత్వ బాధ్యులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి వారి వాంగ్మూలాలను రికార్డు చేసింది. 

విచారణ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు మంత్రి వర్గం ఆమోదం లేదన్న విమర్శలు వచ్చాయి. దీనిని నిర్ధారించుకునేందుకు ఇటీవల కమిషన్ మంత్రివర్గం నిర్ణయాల మినిట్స్‌ను కూడా తెప్పించుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లను, రిటైర్డ్ ఇంజినీర్లను, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి ముందుగా కమిషన్ అఫిడవిట్లను స్వీకరించి వాటి ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. 

విచారణలో భాగంగా కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డిఎస్‌ఎ) నివేదికలను కూడా కమిషన్ పరిగణలోకి తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన తన్నీరు హరీష్‌రావులను కమిషన్ విచారించింది.