
వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నజన గణన కోసం ఈసారి కొత్తగా వెబ్ పోర్టల్ ఆవిష్కరిస్తున్నారు. ఆ పోర్టల్ ద్వార పౌరులు స్వయంగా జనగణనలో పాల్గొనవచ్చు. రెండు దశల్లో జరిగే జనాభా లెక్కింపులో ఆ ప్రక్రియ అందుబాటులో ఉండనున్నది. దేశవ్యాప్తంగా తొలిసారి డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కలు జరగనున్నాయి.
ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో మొబైల్ అప్లికేషన్స్ ద్వారా లెక్కింపు అధికారులు పౌరుల డేటాను సేకరించనున్నారని అధికారులు తెలిపారు. దేశంలో తొలిసారి స్వీయ గణను విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. దీని కోసం ప్రత్యేకమైన వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేశామన్నారు. రెండు దశల లెక్కింపులో స్వీయ గణన ఉంటుంది. హౌజింగ్ సెన్సెస్, పాపులేషన్ ఎన్యుమరేషన్ వేళ ఆ డిజిటల్ ప్రక్రియ అందుబాటులో ఉండనుంది.
జనాభా లెక్కల ప్రక్రియను ఆధునీకరించేందుకు డిజిటల్ సెన్సెస్ నిర్వహించనున్నారు. టెక్నాలజీ ద్వారా తొలిసారి డేటాను సేకరించనున్నారు. దాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో సెంట్రల్ సర్వర్‌కు చేరవేస్తారు. దీని వల్ల జనాభా లెక్కలకు చెందిన సమగ్ర డేటా తొందరగా అందుబాటులోకి వస్తుందని ఓ అధికారి తెలిపారు. డేటా సెక్యూరిటీ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. డేటా సేకరణ, ట్రాన్స్‌మిషన్, స్టోరేజ్ వేళ ఎటువంటి భద్రతా లోపం జరగకుండా చూస్తున్నారు. హౌజ్‌లిస్టింగ్, హౌజింగ్ డేటాను ఏప్రిల్ ఒకటి, 2026 నుంచి సేకరించనున్నారు.
ఆ తర్వాత రెండో దశ ఫిబ్రవరి 1, 2027న ప్రారంభం అవుతుంది. రెండో దశలో జనాభా గణన జరుగుతుంది. వచ్చే ఏడాది సేకరించబోయే జనాభా లెక్కల్లో కులగణన కూడా జరగనున్నట్లు అధికారులు చెప్పారు. దేశంలో జనాభా లెక్కలు చేపట్టడం ఇది 16వ సారి అవుతుంది. స్వాతంత్య్రం తర్వాత 8వ సారి లెక్కిస్తున్నారు. జూన్ 16వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. జన గణన కోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మూడు అంచెల విధానాన్ని అవలంబిస్తున్నారు. ప్రతిదశలో జాతీయ శిక్షకుడు, మాస్టర్ శిక్షకుడు, ఫీల్డ్ ట్రైనర్ ఉంటారు.
ఫీల్డ్ ట్రైనర్లు సుమారు 34 లక్షల మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తాడు. జనాభా లెక్కల వేళ కౌంట్ మళ్లీ జరగకుండా ఉండేందుకు ప్రతి బ్లాక్‌కు ఓ ఎన్యుమరేటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సెన్సస్ కమీషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు. జిల్లాలు, సబ్ జిల్లాలు, తహసిల్, తాలూకాలు, పోలీస్ స్టేషన్ల యూనిట్లను ఏర్పాటు చేసిన మూడు నెలల తర్వాత సెన్సెస్ ప్రక్రియ మొదలవుతుందని ఆయన తెలిపారు.
More Stories
16 వేల మంది విదేశీయులు దేశం నుంచి బహిష్కరణ
బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యాం పనులకు భారత్ శ్రీకారం
చట్టవిరుద్ధమని తేలితే బిహార్‌లో ఎస్ఐఆర్ ను రద్దు చేస్తాం