
పాకిస్థాన్ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రముఖ ఎమ్ఎన్‌సీ సంస్థ, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ అధినేత జవాద్ రెహ్మాన్ లింక్డ్ ఇన్ వేదికగా తెలిపారు. దీంతో ఆ దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు భారీగా తగ్గపోయి, నిరుద్యోగ రేటు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే భారత్ తో యుద్ధం, వాణిజ్యంపై ఆంక్షలు, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత, నిధుల కొరత, నీటి సంక్షోభంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
జూన్ 2000 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ సంస్థ పాకిస్థాన్ లోకి అడుగు పెట్టింది. తాజాగా ఆ దేశం నుంచి వెళ్లిపోతున్నట్లు ఆ సంస్థ వెళ్లిపోతున్నట్లు సంస్థ అధినేత తెలపడంతో పాకిస్థాన్ లో 25 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ప్రస్థానానికి ముగింపు పలికినట్లు అయింది.
అయితే ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ఇప్పటికే అనేక కార్యక్రమాలను ఆ సంస్థ నిలిపివేసింది. భారీ సంఖ్యలో లే ఆఫ్ లు ప్రకటించింది. ఇప్పుడు ఆ సంస్థలో కేవలం ఐదుగురు ఉద్యోగులు మాత్రమే ఉండటం గమనార్హం.
“ఎండ్ ఆఫ్ యాన్ ఎరా.. పాకిస్థాన్ లో మైక్రోసాఫ్ట్ సంస్థను జూన్ 2000 లో ప్రారంభించాం. పాకిస్థాన్ లో 25 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ప్రస్థానానికి ముగింపు పలకనుంది. ఇప్పటికే ఉద్యోగులు వెళ్లిపోయారు. మరికొంత మంది త్వరలో నిష్క్రమిస్తారు. పాతికేళ్ల పాటు ఈ సంస్థను పాకిస్థాన్ లో నడిపినందుకు గౌరవంగా భావిస్తున్నా..” అని ఆ సంస్థ అధినేత జవాద్ రెహ్మాన్ లింక్డ్ ఇన్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇక పాకిస్థాన్ లో ఇబ్బందులు తట్టుకోలేక చాలా సంస్థలు తమ ఆస్తులను స్థానిక సంస్థలకు అమ్ముకుని వెళ్లిపోయాయి. ఈ జాబితాలో ఉబర్, ఫైజర్, షెల్, ఎలీ ఎల్లీ, సోనోఫి, టెలినార్, లొట్ కెమికల్స్ ఉన్నాయి. ప్రస్తుతం పాక్ లో సైన్యం పెత్తనం పెరగడం, ఉద్రిక్తతలు, విధ్వంసం, రాజకీయ అస్థిరత, యుద్ధాలు, ప్రభుత్వ నియంత్రణ, అనిశ్చితి, అస్థిర వాతావరణం.. ఇలా చాలా కారణాలతో అక్కడి ఎమ్ఎన్‌సీ కంపెనీలు బయటకు వచ్చేస్తున్నాయి.
More Stories
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్
25 శాతం అదనపు సుంకాలను అమెరికా తొలగించే అవకాశం